పుట:Kashi-Majili-Kathalu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

కాదంబరి

బయలువెడలి వైశంపాయనుఁడును వేరొక తురగమెక్కి తోడరా రాజమార్గంబున నడుచుచుండెను.

రాజపుత్రుండు సమాప్తసకలవిద్యుండై విద్యాగృహమునుండి వచ్చుచున్నవాఁడను వార్త విని పౌరకాంతలెల్ల నుల్లము లుత్సుకోత్ఫుల్లములై యొప్పదెప్పున నప్పురుషరత్నముం జూడ వేడుక పడుచు సగముసగముగా నలంకరించుకొనియుఁ బూర్తికాకుండఁగనే చేసెడి పనుల విడిచి పరుగుపరుగునఁ జరణనూపురరవముఖరితంబుగ సౌధాం తరంబుల జేరి మరకతవాతాయన వివరములనుండి యానరేంద్రనందను నీక్షింపఁదొడంగిరి.

అప్పుడా మేడలనుండి మకరధ్వజవిజయనినాదము ననుకరింపుచు రమణీమణుల మణిభూషణఘోషము శ్రోత్రపర్వముగాఁబయలు వెడలినది. ముహూర్తకాలములో నంతఃపురములన్నియు యువతిజన నిరంతరము లగుట స్త్రీమయము లైనట్లు ప్రకాశించినవి.

కౌతుకప్రసారితనయనలై చూచుచున్న యమ్మగువల హృదయంబు లద్దములవలె నారాజసూనుని యాకృతి నాకర్షించినవి. అప్పు డావిర్భూత మదనరసావేశహృదయులై యమ్మదవతు లొండొరులు సపరిహాసముగా సాక్షేపముగా సాభ్యసూయముగా సోత్ప్రాసముగా నిట్లు సంభాషించుకొనిరి.

ఓసీ! వేగముగాఁ బరిగిడుచుంటివి. నేనుగూడ వచ్చెదఁ గొంచెము నిలువుము.

ఆహా! నీ మోహము. రాజపుత్రుంజూచినతోడనే యున్మత్తురాలవై పోయితివే? యుత్తరీయము స్వీకరింపుము.

చపలురాలా! మోముదమ్మిం గ్రమ్ముచున్న యలకమ్ముల ముడిచికొని మరియుం జూడుము.

మూఢురాలా! శిరముపై చంద్రలేఖ వ్రేలాడుచున్నది.