పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

రాత్రి దత్తునికిఁగనంబడినట్లె విద్యుత్ప్రభ వారికిఁ గనంబడినదికాని యప్పుడు పోలేక యారేయి నందు వసించిరి.

రాత్రియెల్ల సువర్ణపదిక నిద్రబోవక రత్నపదిక నెప్పుడుజూతును, ఎప్పుడు కౌఁగిలించుకొందు నెప్పుడు మాటాడుదునని తలంచుచు జాగరము జేసినది. సూర్యోదయ మైనది. చీఁకటు లంతరించినవి. బాలా తపముచే దిక్కులెఱ్ఱఁబడినవి. పక్షులు కులాయములవిడిచి నలుదెసలకుఁ బారుచుండెను. అప్పుడు సువర్ణ పదిక సువర్ణ నాభుని చెట్టఁ బట్టికొని యామెట్ట నెక్కుటకుఁ బ్రారంభించినది. దారి లేదు. విషమ పాషాణకంటకాదులచే దుర్గమమైయున్నను జేతులతో నాని కొమ్మలఁ బట్టికొనుచుఁ గొందెల దుముకుచు మెట్టల నెక్కుచుఁ బొదల దూరుచు జాముప్రొద్దెక్కువఱకు నెగఁబ్రాకి యతికష్టముమీదఁ యక్షాలయ ప్రాంగణవేదికకుఁ జేరిరి.

ఒడలు చీరికొనిపోయినది. మోమున రక్తము స్రవించుచున్నది. కట్టినవలువలు పీలికలైనవి. ఒకచో సువర్ణ పదిక కాలుజాఱి పడినది. మోకాలునకు ఱాయితగిలి రక్తముగారుచుండెను. సోదరీదర్శన లాలసయగు నాసతి కావెతలేమియు నాటలేదు. ఆకుట్టిమము స్ఫటికమణి శిలచేఁ గట్టఁబడి సూర్యకాంతులు ప్రతిఫలింప మిఱుమిట్లుగొల్పుచున్నది. అలకాపురంబునంగల పుష్పజాతులన్నియు నందు నాటఁబడియున్నవి. షడృతువుల నందుఁగట్టిపెట్టిన ట్లన్నికాలముల పూవులు వికసించి వాసనల వెదజల్లుచున్నవి. ముహూర్తకాలమందు విశ్రమించినంత వారి యాయాసమంతయు నంతరించినది.

యక్షాలయమున ద్వారశాఖలుగా నమర్పఁబడిన రత్నముల యందు లోపలివిద్యుద్దీపములు ప్రతిఫలించి రాత్రుల విశేష తేజము వ్యాపింపఁజేయుటచే నాగిరిక్రింద నొకచక్కి వసించినఁ గనంబడును. ఆ తేజమేలేనిచో నాయక్షాలయ మందున్నదని బ్రహ్మ తెలిసికొనఁజాలఁడు.