పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

శక్యమా ? నేను గృతకృత్యుండ ధన్యుండ. ఇప్పు డీబాల దాహమడుగుచున్నది యీయవచ్చునా? అని యడిగిన నేను వేడినీళ్ళ జలకమాడింపుఁడు. పథ్యపానాదులు యథాయోగ్యముగా నడిపింపుఁడు అని చెప్పితిని. అంతలో నాశుభవార్త తల్లియు బంధువులు విని గుంపులుగా నచ్చటికివచ్చి యచ్చిగురాకుఁ బోఁడింజూచి మీఁదఁబడివిలపింప మొదలుపెట్టిరి.

అవ్వరారోహ చిరాకుపడి రొదసేయవలదని సూచించినది. అప్పు డందఱు నన్ను దైవముఁబూజించు నట్లు పూవులచేఁ బూజించిరి. పిమ్మట నాకొమ్మను జలకమాడించి నూత్నాంబరభూషణాదులచే నలంకరించి లఘ్వాహార మొసంగిరి. ఇంచుక స్మృతిగలిగి మాట్లాడుట ప్రారంభించినతరువాతఁ దల్లి మెల్లగాఁ దలచిక్కుఁ దీర్చుచు అమ్మా ! నీవుజేసిన క్రియలు దారుణములు. నీ కిట్టిబల మెక్కడనుండి వచ్చినదో తెలియదు. ఆవిషయములు నీ కేమైన జ్ఞాపకమున్నవియా ? అని యడిగినదఁట.

ఆచిన్నది అయ్యో ! నాకేమియుం దెలియదు. నాఁటిరేయి మంచముమీఁదఁ బరుండి నిద్రించుచుండ గుభాలున నెవ్వఁడో వచ్చి మీఁదఁ బడినట్లైనది. నాశరీరము బ్రహ్మాండమంత లావైనట్లు తోఁచినది. అంత వఱకు జ్ఞాపకమున్న ది. తరువాత నేమిజరగినదో యెఱుఁగను. ఏమేమి చేసితిని ? అని సిగ్గుతో నడిగినఁ దల్లి యాచేష్టలన్నియుం జెప్పినది. గోనర్దీయుఁడను మహానుభావునివలన విముక్తినొందితివి. ఆతఁడే నీకు భర్తయని చెప్పినదఁట. .అయ్యయ్యో ! నేను నిష్కారణము మాంత్రికులైన బ్రాహ్మణోత్తముల సంకటపఱచితినా? కటకటా! వారు మిక్కిలి బాధపడుచున్నారుకాఁబోలు ! తల్లీ ! పాపము వారికి మాతండ్రిగారు తగినచికిత్సలు చేయించిరా? నాపడినబన్నముకన్న వారియిడుములు విన్న నా కెక్కుడు పరితాపముగానున్నది. అని వగచుచుండఁ దల్లి వారించు చు పట్టీ! నీ వెఱుంగకచేసినదాని కెవ్వరికిఁ గోపముండును ? మీతండ్రి వారికిం దగినసాహాయము చేయించిరి. నీ వందులకు విచారింపఁబనిలేదు.