పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

రాజు - ఏమీ! మీ కింతసామర్థ్యము గలదా ? మహాత్మా ! నేఁటిసాయంకాలములోపున నాబిడ్డను నాతో మాటాడఁజేయుదువా ?

నేను -- సాయంకాలమువఱకు నేల? రెండుగడియలలో మాటాడింతును.

రాజు - అందుల కేమిసన్నాహము కావలయును తండ్రీ !

నేను - ఏమియు నక్కఱలేదు. ఆచిన్నది యెందున్నదో చూపుఁడు. నేనక్కడికిఁ బోయెదను.

రాజు - అయ్యో ! లోపలికే పోయెదరా? అమాంతముగా మీఁదఁబడి చంపునుచుఁడీ ! నాకు భయమగుచున్నది.

నేను - నాకులేనిభయము మీ కెలా ? ఆచిన్నదియున్నగది చూపుఁడు. చూపుఁడు. అని యడిగితిని.

నామాటలు విని యాభూపాలుం డపారసంతోషముతో నార్యా! రెండుగడియలలో నాకూఁతురితో సంభాషింపఁజేసితివేని నిన్నిప్పుడే రాజ్యపట్టభద్రుం జేసి యల్లునిగాఁ జేసికొనుచున్నా ను. అని పలుకుచు నాపాదములకు సాష్టాంగ నమస్కారములు గావించెను.

భూపా ! లెమ్ము లెమ్ము. నా కీరాజ్యప్రాప్తికొఱకే యీభూతంబు నీకూతుం బట్టినది. ఆలస్య మేలచేసెదరు. గది చూపుఁడని యడిగితిని,

అమ్మహారాజు దండహస్తులైన రక్షకభటుల నాప్రాంతమందుఁ గాచియుండునట్లు నియమించి న న్నాగదియొద్దకుఁ దీసికొనిపోయి బీగము తీయించి జడియుచు దూరముగాఁబోయి తొంగిచూచు చుండెను. అప్పుడు నేను గొంతయట్టహాసము గావించితిని. స్నానముచేసి విభూతి రుద్రాక్షమాలికాలంకృతసర్వప్రతీకుండనై చేత బెత్తముబూని హుంకారపూర్వకముగ గొణ్ణెముదీసి తలుపులుత్రోసి లోపలకుఁ బోయితిని.

ఆచిన్నది తలవిరియఁబోసికొని శల్యావశిష్టయై మంచముపైఁబడి యున్నది. నన్నుఁ జూచినతోడనే గాండ్రుమని పెద్దపులివలె నఱచినది.