పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

గీ. గొర్కె వేడుకకాండ్రతోఁ గూడికొనుచు
    నిల్లువాకిలి విడిచి తానెపుడు వేడు
    కలకుఁ గ్రీడకు వాడవాడలఁ జరించు
    శైశవానంతరమున లీలాశుకుండు.

కులాచారంబు మట్టుపెట్టి దురాచారంబులకు లోనై లీలాశుకుండు విటనటగాయకాదులు మిత్రులై వర్తింప నాయూరిలో నంత యాకతాయలేడని పేరుపొంది తిరుగుచుండ మఱిరెండేఁడులు గతించి నంత వాని మాతయు మృత్యుదేవత వాఁతంబడినది. ఎప్పటికేని యిల్లు చేరిన మందలించు తల్లియుం గడతేరిన నడ్డుచెప్పువారులేక నతండు మఱియుఁ గోడెకాండ్రంగూడి సంచరింపుచుండ ననినయనిధానమగు యౌవన మతనిమేనఁ బూర్ణముగా నావేశించినది.

గీ. అద్దమున నాత్మముఖబింబ మరసివేడ్క
    తోడ నూనూగు మీసాల దువ్వికొనుచు
    మొగము చిట్లించి కనుబొమ్మ లెగరవైచు
    మరుఁడు తనకీడుగాడని మదిఁదలంచు.

పెద్దల ప్రసిద్ధివిని పిల్లనిత్తుమని యెవ్వరైన వచ్చినచో విరక్తుండువోలె వారికిట్లు సమాధానము జెప్పును.

సీ. దుష్టసంసార పాథోధిముంపఁగఁ బద
                   స్థగితమౌ పెద్దప్రస్దరము పత్ని
    భవకూపమునఁ గూలఁబడఁ ద్రోయదిగియంగఁ
                  గట్టిన కన్నులగంత కాంత
    సంసృతిగహన సంచారంబునకు దారి
                  గాననీయని యంథకార మింతి
    భవ బంధనాగార పాతంబునకుఁ గాళ్ళ
                  ఘటియించు మేటిశృంఖల నెలంత