పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

కాశీమజిలీకథలు - మూడవభాగము

న్యుడు కాడు పోయివత్తు, మీతో బెద్దయుంబ్రొద్దు మాటాడవలసిన పనియున్నది, వెండియు శ్రమయనక సాయంకాలమున నీముసలివానితో రావలయునని ప్రార్థించుచున్నదాననని పలుకుచు ఆతని అనుమతి వడసి ముసలివాని నొద్దకరిగి యోరీ! సాయంకాలము వచ్చునప్పుడు రెండవవానింగూడ దీసికొనిరమ్మని చెప్పి లోపలకు బోయినది.

తరువాతఁ గందర్పుడు డెందంబు నయ్యిందుముఖి వచనంబుల దలంచుచు నుత్సాహంబు దీపింప మధ్యాహ్నంబగుడు ఆక్కూలివానితోఁగూడ నయ్యిల్లు వెడలి వెండియు సాయంకాలమున వత్తుననివానికిం జెప్పి అప్పుడు తన విహారసౌధంబునకు బోయెను.

పోయినది మొదలు గడియలు లెక్కిడుకొనుచు నిమిషము యుగముగా గడిపి ముసలివాడు చెప్పిన సమయమైనంత మాఱువేషముతో నరిగి తనకొఱకు వేచియున్న ముసలివానితోఁ గూడ మణివర్మ యింటికిం బోయెసు.

అంతకుమున్న యాతోటలోనికి వచ్చియున్న సుభద్ర ముసలివానిని మారుమూలఁ బనిచేయుమని నియమించి మిక్కిలి దట్టముగా అల్లుకొనియున్న పూలతల మాటున నారాజపుత్రునితోఁ గూడ అరిగి ఉచితసత్కారములు గావించి నమస్కరించుచు దేవా నన్నుగుఱించి మీరు మిక్కిలి అలసట జెందితిరి. భూతలస్పర్శక్లేశంబున మీపాదంబులు కందినవి. యించుక యొత్తి ఈ అపరాధంబు బాపుకొనియెదనని పలుకుచు వంగిపాదంబులు ముట్టబోవుడు వారించువాడుబోలె నారాజనందనుం డాకుందవదన చేతులు పట్టుకొని పై కెత్తి దాపునకులాగిన అప్పుడది యొక యాలింగనవిశేషంబయ్యె. దానంజేసి వారిమేనులు సాత్వికభావవికారములు నొందుటయు నొండొరుల అభిప్రాయములు చెప్పకయే అన్యోన్యము విదితములైనవి.

ఇంతలోఁ జీకటిపడుసమయమగుటయుఁ గందర్పుడు సుందరీ ప్రొద్దుగుంకినది. ఇక నిందుండరాదు. మీయింటి విశేషములేమియుం జప్పితివికావు. మీతాత మణివర్మ యేమిచేయుచుండును? నీకుఁ దల్లి లేదట? అతనికి నీయందనుగ్రహము కలదా? మీ యింటియందు విచిత్రవస్తువులు పెక్కులున్నవని చెప్పుదురు. వానిని నాకుఁజూపింతువా! అని క్రమంబున నాయింటి ప్రస్తావన దెచ్చుటయు అయ్యబల తనకథ అంతయు ఆతనికెఱిగించి వెండియు నిట్లనియె.

దేవా! మీరీరాత్రి యింటికిం బోవలదు. మాతాత యిప్పుడు జాఢ్యముచేత మంచము విడిచిరాలేడు. మాఅవ్వయు అతనిదాపున శయనించును. నాసౌధమునకు వారురారు. మీకు మాయింటి విశేషములన్నియు రాత్రి జూపెదనని చెప్పి అతని నొప్పించి కనుచీకటి పడినతోడనే గుప్తమార్గంబున దనమేడకుఁ దీసికొనిపోయి యొకచోట గూర్చుండబెట్టి తానుబోయి చేయవలసిన పనులుచేసి యావృద్ధులచే శయనించుట కనుజ్ఞ పుచ్చుకొని యేకాంతముగా నాహారపదార్థములు దీసికొని ఆతనియొద్దకుం బోయెను.