పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



శ్రీరస్తు

శుభమస్తు - అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

మూడవ భాగము

పందొమ్మిదవ మజిలీ

జయభద్రునికథ

శ్లో॥ శ్రీ మద్గౌరీలతాళ్లిష్టం జటావల్లవశోభితం
     విబుధాభీష్టంఫలదం శంభుకల్పద్రుమం భజే॥

పందొమ్మిదవ మజిలీయందు గోపకుమారుండు నగలవిశేషంబు లరయ నరిగి అతిరయంబునఁ దిరిగి పరుగిడివచ్చి మణిసిద్ధుని పదంబుల వ్రాలి యూర్పులు నిగుడింపుచు మహాత్మా! ఈవీటినడుమ బెద్దకోట గలదు. గుంపులుగాఁ గూడుకొనిపోవు జనులతో నే నాకోట ముంగలి యంగణము చేరితిని. అందు వలయాకారముగా జనులు మూఁగికొని యేదియో వింతఁ జూచుచుండిరి. నే నాగుంపులో దూరి పరికించితిని. చిటచిటారావములతో విస్ఫులింగము లెగయ ధూమంబు మబ్బువలె నెల్లడల వ్యాపింప మింటిపొడవున మండుచున్న చితియొండు గనంబడినది.

అది యెందులకో యని యాలోచించుచుండ నొకదండనుండి అండజయాన యోర్తు సకలాలంకారభూషితయై పుష్పాంజలితో నతిరయంబునవచ్చి అగ్నికి వలగొని యాపూవు లందువైచి చేతులెత్తి మ్రొక్కుచు

క. పతిభక్తి లేక యతఁ డుప
   పతియని నే నెఱిఁగి కామపరతంత్రఁత గూ
   డితి నేని యిపుడుఁ నన్నా
   హుతిగాఁ గొనుగాత వీతిహోతృఁడు బలిమిన్.

అని పలుకుచు అక్కలికి గుభాలున నాయగ్నిలో దుమికినది. కటకటా ఒక్కరైనను వలదని వారింపరైరి. కూడదని యడ్డగింపరైరి. అనుచితమని పట్టుకొనరైరి. చేతులు తట్టుచు నారాయణస్మరణ గావింపుచుండిరి. నే నప్పుడు అయ్యో అయ్యో అని గోలుగోలున నేడువదొడంగితిని. వినుం