పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

కాశీమజిలీకథలు - మూడవభాగము

డందున్నవారికన్నఁ బావకుఁడే దయాళుడు అగ్నిభట్టారకుఁడే చల్లనివాడు. అచ్చేడియ బడినతోడనే జ్వాల లుపసంహరించుకొని నీరుజల్లినట్లు చల్లబడి యాజవ్వనిం గాపాడెను. అక్కలికి యగ్గిఁపడియు బుగ్గిగాక పుటంబిడిన బంగారమువలె వన్నెగలిగి మెఱయుచున్నంత జూచి యాప్రాంతమందున్న యొకచక్కనిచిన్నవాఁ డాకాంతచెంత కరిగి ప్రాణనాయకీ! రమ్ము రమ్ము. నీకళంకము బాసినదని పలుకుచుఁ జేతులు సాచి గుచ్చియెత్తి మంగళవాద్యములతోఁ గోటలోనికిఁ దీసికొనిపోయెను.

నే నప్పు డప్పడతివృత్తాంత మెట్టిదని యెవ్వరి నడిగినను నామాట వినిపించుకొనినవారు లేరు యింతయేల? మా అయ్యగారే అంతయుఁ జెప్పగలరని పరుగిడి వచ్చితిని. శిష్వుని మన్నించి యాప్తు నాదరించి యావృత్తాంత మెఱింగింపుఁడని పాదంబులం బడి వేఁడుకొనియెను. మణిసిద్ధుండు మణిప్రభావంబున అయ్యుదంత మంతయు నాకలించుకొని యిట్లు చెప్పఁదొడంగెను. గోపా! వినుము.

ఈ నగరము పేరు మణిప్రస్థము. కుంతిభోజుండను రాజు దీనిం బాలింపుచుండెను. అతండు సుమతి యను సతియందుఁ గాలక్రమంబున నేడ్వురఁ బుత్రులం గాంచెను. కడపటివానిపేరు జయభద్రుఁడు. వాని జన్మకాలఫల మరసి దైవజ్ఞులు ఈ బాలుండు భార్యమూలమున భూలోకమంతయు వ్యాపించినకీర్తి గలవాఁడగునని వ్రాసియిచ్చిరి. అవయవలక్షణంబులు పరీక్షించి సాముద్రికశాస్త్రవేత్త లాట బలబఱచిరి. రాజు వానిం గుమారసాదారణదృష్టిం జూడక అతి ప్రయత్నంబునఁ బెనుచుచు యుక్తకాలంబునం జదువవేసి సుమిత్రుఁడను మిత్రునితో జతపరచి పదుగురు నుపాధ్యాయుల నియమించి విద్యలఁ జెప్పించుచుండెను.

గంట నొకయుపాధ్యాయుడు వచ్చి యొక్కొక్కవిద్య గఱపుచుండును. కొన్నివత్సరములకు రాజపుత్రుఁడును సుమిత్రుండును బెక్కువిద్యల నధికపాండిత్యము గలవారైరి. రాజపుత్రునకు అన్నికళలయందు ఆభినివేశము గలిగినది కాని రసప్రకరణమునం దేమియు బ్రవేశము గలుగలేదు. తదుపదేష్ట కష్టపడి వాత్స్యాయనసూత్రములు రతిరహస్యము, అనంగరంగము, రతిమంజరి, రతిరత్నాకరము, రసమంజరి, లోనగు గ్రంధము లెన్నియో పలుమాఱు చదివించి బోధించెను. కాని వానిమనసు దానియం దేమియు రుచిగలది కాదయ్యెను. ఆ గ్రంధము లన్నియు నిష్ప్రయోజనము లని గురువుతో వాదించుచుండెను.

పరీక్షింప జయభద్రుఁ డితరవిద్య లన్నిటిలో మొదటివాఁడుగా నెన్నఁబడెను. రసప్రకరణములో ఆధముఁడుగా లెక్కకు వచ్చెను. ఆవిద్య గఱపు గురువు మిక్కిలి పరితపించుచు నొకనాఁడు శిష్యులిరువురు నుద్యానవనవిహారము సేయుచుండ అందుఁ బోయి వారిచే గౌరవింపఁబడి యుపవిష్టుండై రాజపుత్రున కిట్లనియె.

జయభద్రా ! నీకు విద్య గఱపిన గురువులందఱు నధికముగా బారితోషికము బొందిరి. నే నొక్కరుండ నిరసింపఁబడితిని. యెన్నిసారులు చెప్పినను నీకీరసము మానసమునఁ బట్టకున్నది. నే నేమి చేయుదును. దీనిం గ్రహించినఁగాని పురుషుని