పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

కాశీమజిలీకథలు - మూడవభాగము

నేనా వేశ్యమాతవెంట దానింటికి బోయితిని. ఆ వృద్ధవేశ్య మదీయరూపలావణ్యాదివిశేషములు జూచి నామూలమున ధనము సంపాదించుకొనవలయునని అభిప్రాయముతో నన్ను దీసికొనిపోయినది.

మిక్కిలి వైభవములతో నొప్పుచున్న దాని యిల్లుచూచి నేను వెఱగుపడుచు నవ్విలాసములకు జిత్తము జొరమి నొకమూలను బడియుండ శరీరము నిలుచుటకై అన్నము మాత్రము దినుచు సంతతము మిమ్మే స్మరియించుచు మీజాడ జూచుచు నతి కష్టముతో గాలక్షేపము చేయుచుంటిని. కొన్ని దినముల వరకు నెద్దియో పని కల్పించుకొని యాయూరిబయటకుబోయి మీజాడ నరయుచుంటిని. ఏమియుం దెలిసినదికాదు.

ఆ రుక్మవతి చెల్లెలు రత్నావతి అను వేశ్యవచ్చి నిత్యము దానితో నెద్దియో బోధించునది. కాని నేనంతగా విమర్శించితిని కాను. అంతట నాకు నవమాసములు నిండి ప్రసవవేదన యారంభించనతోడనే యీ రత్నావతి వచ్చినది. ఇరువురు నెద్దియో గుజగుజలాడిరి. అప్పుడు రుక్మవతి నన్ను జూచి అమ్మా! ప్రసవమగు సమయమున గన్నులకు గంతలు గట్టుకొనుట ఈదేశాచారమైయున్నది. మే మట్లు చేయుచున్నాము. దీనికి నీవు సందియమందవలదు సుమీ! అని పలికి నాకన్నులకు గంతలు కట్టినది.

మఱికొంతసేపటికి నేనీ ముద్దుపట్టిని గంటిని. కాని వాండ్రు అప్పసికూన నప్పుడే దయలేనివారై రహస్యముగా దీసికొనిపోయి ఈ పట్టణమున కనతిదూరములో నున్న యొకనూతిలో బారవిడిచిరి. మఱియు నాయెదుట నొక రాతిగుండు నుంచి అయ్యో? కూతురా? నీ వీరాతిని గంటివే. కటకటా అని పలుకుచు నాకంటి గంతలు విప్పిరి.

అప్పుడది అంతయు యథార్ధమనుకొని అప్పటి గ్రహస్థితికదియు సరిపడినదని నేను మనంబున దలుచుకొని శోక మడంచుకొనుచు గాలగతి కచ్చెరువందు చుంటిని.

నన్ను రత్నావతియు రుక్మవతియు దత్కాలోచితము లగు మాటలచే నోదార్ప దొడంగిరి కట్టా! అట్టియవస్థలో నైన నాకు జీవితాశ వదలినదికాదు. ప్రాణములకన్న ప్రియమైన వస్తువులు లేవు కదా? మఱికొన్ని దినములరిగిన రుక్మవతి నన్ను జూచి మంచివస్త్రములు ధరింపుమని మణిమండనములు మేన నలంకరించు కొనుమనియు నిత్యము బోధింప దొడగినది. నాయం దక్కటికముచే నట్లనుచున్నదని నేను తలంచుచు మనంబున నిష్టములేకున్నను దాని చిత్తము చిన్నవోవకుండ ననుమతించుచు గొంచెము గొంచెముగా నట్లు చేయుచుంటిని. మరియొకనాడు రత్నావతి నాయొద్దకువచ్చి యెద్దియో ప్రసంగములో నాతో మెల్లగా నో సుందరీ? నీ వెప్పుడును నివారింపుచునే యుందువేమి? నీ సౌందర్యము త్రిలోకమోదాజనకమై యున్నది.