పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(16)

నాగదత్తుని కథ

129

ముంచితివా! నా ప్రియుం డెద్దియో యాపదంజిక్కినట్లు తలంచెద, లేకున్న నన్నొంటిమై డించి జాగుజేయువాడా? ఇక రాడు ఆ! యేమీ ఇప్పుడు నేనేమి చేయవలయును ఇది అంతయు నిక్కువమే! నేను నాయంతఃపురము దాటి యిచ్చటికెట్లు వచ్చితిని. ఇది స్వప్నము కాబోలు నిజముగా గందర్పుడనువాడెన్న డేని నా యొద్దకువచ్చెనా? అయ్యయ్యో! ఆకుమఱుంగుపిందెవలె నేయాపదయు నెఱుంగక యంతఃపురంబుల బెక్కండ్రు చేడియ లూడిగములు సేయ సుఖపరంపరలచే గాలక్షేపము చేయుచుండెడి నాకెట్టి యవస్థ వచ్చినది? కట్టా ఇప్పు డెందు బోవుదును? ఎవ్వరితో చెప్పుకొందును? న న్నూరడించువారెవ్వరు? అని పరిపరిగతుల దలపోయుచు మీరు వెళ్ళిన మార్గమున నెవ్వరు వచ్చినను మిమ్ముగానే తలంచి చూచుచు గాకుండిన హా! అనివేడి నిట్టూర్పు నిగుడ్చుచు బ్రొద్దుదెస జూచి గుండెలు బాదుకొనుచు నీరీతి గురరియుంబోలె బెద్ద తడవు విలపించితిని.

అంతలో సాయంతన సమయమగుటయు నాకు నేన యుపశమించుకొని యెద్దియో మొండిదైర్యము హృదయంబున గదుర బురములోనికి బోవ నిశ్చయించుకొని మేని అలంకారములన్నియు దీసి మూటగట్టుకొని పటణాభిముఖముగా మీరు పోయినదారినే పదిఅడుగులు నడిచి నంత నాప్రాంతమున నొక వేశ్యమాత ఇందొకచోట గూర్చుండి యేడ్చుచుండెను దానిం జూచి దాపునకు బోయి నేను అవ్వా! నీ వెవ్వతెవు? ఇట్లు విలపింప గారణమేమి? చీకటి పడుచున్నదే పురములోనికి రావా? అని అడిగిన నాజరఠ నన్ను గన్నెత్తి చూచి అయ్యో తల్లీ! నీవు మరల బ్రతికి నన్నోదార్చుటకై యిట్లు వచ్చితివే అని అరచుచు నాపై బడి కౌగిలించుకొనినది అప్పుడు నేను బెదరుచు నుది నక్కటికము దోప ఆమ్మా! నన్నెవ్వతెననుకొంటివి? నేను నీవనుకొనిన దాననుకాను ఎవ్వరికొరకిట్లు విలపించుచున్నదానవు నీ వృత్తాంతము జెప్పుమని సానునయముగా నడిగిన నది యిట్లనియె. అమ్మా! నేను బోగముదానిని నాపేరు రుక్మవతి నాకొకకూతురు కామమంజరి అనునది కలదు. అది నీ పోలికనే యుండునది. నా దురదృష్టవశమున కొన్ని దినములక్రిందట గాలధర్మము నొందినది. ఇది దానిస్మశానము నే డచ్చేడియ నాకు జ్ఞాపకమువచ్చిన నిచ్చటికి వచ్చి విలపించుచున్న దాన. ఇంతలో నీవు వచ్చితివి. నన్ను జూడ నాకూతురు జూచినట్లే యున్నది నీదేయూరమ్మ? మా యింటికొకసారి వత్తువా? నీవొంటిగా నిచ్చటికి వచ్చితివేల? నీ వృత్తాంతము సెప్పుమని అడిగిన నేనిట్లంటి అవ్వా! నేనొక రాచకుమార్తెను. గారణాంతరమున నీయూరు చేరితిని. నా పతియు దేశాంతర మరిగె నీయూరు వచ్చెనేమో చూడవలయునను తలంపుతో గ్రుమ్మరుచుంటి నేను గర్భవతిని ఆరుమాసములు గతించినవి నా బంధువులందఱు దూరదేశమందున్న వారు. నన్ను జెడుపనులకు నియోగింపకుందు వేని నీ వెంట వత్తునని పలుకగావిని యమ్ముసలిదియు దానికి నొప్పుకొని అప్పుడే నన్ను దన యింటికి దీసికొనిపోయినదిట నా కప్పు డంతకన్న వేఱొకదిక్కు లేమింజేసి అట్లు పలుకవలసి వచ్చినది. పిమ్మట