పుట:Karunakamu Story by Veturi Prabhakara Sastry.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరుణకము

వేటూరి ప్రభాకరశాస్త్రి గారు

కృష్ణాజిల్లాలో మొవ్వ అని ఒకగ్రామ మున్నది. ఆంధ్ర దేశమందు వేణుగోపాలపదాలు వినని, విని ఆనందించని, రసికులు అరుదుగా ఉంటారు. ఆపదములను రచించిన కవి ఆవూరివాడే నంటారు. సంగీతసాహిత్యములు ఆవూరినీరు తాగితే పట్టుపడునని పూర్వము పెద్దలు చెప్పుకొనేవారు. ఇప్పుడట్టి దేమీ తెలియరాదు. కృష్ణకాలువ వచ్చి ఆభూమి మాగాణి కావడముచేత నీటిగుణము మారినదని అక్కడివా రంటారు. కాబోలును! పూర్వకాల మక్కడ సంగీత విద్వాంసు లనేకులు ఉండేవారట!

ఆవూరికి చేరువనే కూచిపూడి అని ఒక గ్రామ మున్నది. ఆవూరివారందరు భాగవతములాడుదురు. సిద్ధేంద్రులని యోగీంద్రు లొకరు ఆవూరివారికి ఆవిద్య నేర్పినారట! పారంపర్యముగా ఆవిద్యనే వా రభ్యసించవలసినట్లు కూడా విధించినారట! ఇప్పటికీ అక్కడ అట్లే జరుగుతున్నది. పయి రెండుగ్రామములు చేరువగా ఉండడముచేత, ఆవూరివారివిద్య ఈవూరివారికి, ఈవూరివారివిద్య ఆవూరివారికి అంటుతూకూడా ఉండేవట పూర్వకాలమున?

నేనిప్పుడు చెప్పబోయేకథలోనివారు హరి రామయ్యగా రొక్కరు తప్ప ఈమధ్యకాలములో మొవ్వలో సంగీతవిద్వాంసులు మరెవ్వరూ లేరు. హరి రామయ్యగారని అక్కడ ఒక రున్నారన్న సంగతి, ఆయన గొప్పసంగీత విద్వాంసుడన్నసంగతి, ఈకథ ముగిసినతర్వాతనే ఇప్పటి వారికయినా తెలుస్తుంది.

రామయ్యగారు 1860 ఆప్రాంతముల జన్మించిఉందురు. ఆయన పసితనమునాటికి తెలుగు దేశమున త్యాగరాజకృతు లంతగా వ్యాపించలేదట! అప్పుడు అష్టపదులు, తరంగాలు, తాళ్ళపాకవారి పదాలు, తంజావూరి పదాలు మొదలయినవి హెచ్చుగా పాడేవారట! మనము విని యెరుగముగాని హరి రామయ్యగారు బాల్యములో బహుప్రఖ్యాతిగా వీణవాయించేవారనీ, పాడేవారనీ, ఎరిగినవారివల్ల విన్నాను. దీనికి నమ్మకముగా ఈక్రింది కథకూడా విన్నాను. మైసూరునుంచి వీణసాంబన్నగారని ఆకాలములో ఒక మహావిద్వాంసుడు ఆంధ్రదేశమునకు వచ్చి బందరుమొదలయిన చోట్ల శిష్యబృందముతో కొన్నిమాసములుండి, అనేక గానసభలు జరిపి బహుకీర్తిని బహుధనమును సంపాదించుకొని వెళ్ళినాడట!