పుట:Kanyashulkamu020647mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

    Bathing and praying
    Or frisking and playing,
    A model of saintliness,
    Or model of comeliness,
    What were the earth,
    But for her birth?
                        The Widow!

యిది నేను రిఫార్మర్లో అచ్చువేసేటప్పటికి టెన్నిసన్‌చూసి గుండెకొట్టుకున్నాడు. చుట్టతాగడం సమాప్తంచేశి యింటికి పొదాంరా చాలాసేపైంది.

(నాలుగడుగులు యిద్దరూ నడిచేసరికి అగ్నిహోత్రావుఁధాన్లు కలియును.)

అగ్ని-- ఏవఁండీ - హనుమాన్లుగారూ - మీపేరేవిఁటండీ!

గిరీ-- గిరీశం అంటారండి.

అగ్ని-- అదుగో, గిరీశంగారూ రాత్రి మనవఁనుకున్న ప్రకారం మనదావాలు గెలుస్తాయనే మీ అభిప్రాయవాఁ?

గిరీ-- గెలవకపొతే నేను చెవి కదపాయించుకు వెళ్లిపోతాను. మీ వూహపోహలు సామాన్యవైఁనవా? అందులో "యతోధర్మ స్తతోజయః" అన్నట్టు న్యాయం మీ పక్షం వుంది. బుచ్చమ్మగారి కేసు విషయమై జబ్బల్పూర్‌ హైకోర్టు తీర్పొహటి మనకి మహా బలంగావుంది. మాపెత్తండ్రిగారు యిలాంటి కేసే ఒహటి యీ మధ్య గెలిచారండి.

అగ్ని-- దీని కల్లా అసాధ్యం యీకేసు కాకినాళ్లో తేవల సొచ్చింది. మా కరటక శాస్తుల్లుని పంపిస్తే యవడో చవలవకీల్ని కుదిర్చాడు. వాడెప్పుడూ డబ్బు తెమ్మని రాయడవేఁగాని కేసుభోగట్టా యేవీఁరాయడు. గడియ గడియకీ వెళదావఁంటె దూరాభారం గదా?

గిరీ-- మీశలవైతే స్టీమరుమీద నేను వెళ్లి ఆవ్యవహారవఁంతా చక్కబెట్టుకువస్తాను. మాపెత్తండ్రిగారు కాకినాడ కల్లా తెలివైన ప్లీడరు, ఆయనపట్టిన కేసు యన్నడూ పోయిందన్నమాట లేదండి.

అగ్ని-- మీరు వెళితే నేను వెళ్లినట్టే. యంత ఫీజయినా మీ పెత్తండ్రిగారికే వకాల్తీ యిద్దాం. యావఁంటారు?

గిరీ -- మీదగ్గిర ఫీజు పుచ్చుకోవడం కూడానాండి? ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే, ఫీజక్ఖర్లేకుండానే పని చేయిస్తానండి.

అగ్ని-- మీరలా అంటార న్నేనెరుగుదును. గాని గెలిచింతరవాత మనకితోచిన బహుమతీ యిద్దాం.

గిరీ -- యిచ్చినాసరె యివ్వకపోయినా సరేనండి.