పుట:Kanyashulkamu020647mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుర: (వేలు చూపి) అక్కడనే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును. నేను కిరస్తానం యింకా కాలేదే ? మీరు కిరస్తానం అన్న మాట ఇప్పుడే ఒహరు చప్పగా విన్నాను.

రామ: (తనలో) నే చెప్పానంటుందా యేమిటి!

గిరీశం: ఒకరు చప్పగా విన్నావూ? యెవరా జెప్పింది? యెవడికిక్కడికి రావడానికి మగుదూర్‌ వుంది? యిలాంటి చాడీకోర్‌ కబుర్లు చెప్పడానికి యెవడికి గుండె వుంది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీ కెక్కడ గుండుంది ? చెప్పు!

రామ: (తనలో) తంతాడు కాబోలు, యెరక్క చిక్కడ్డాను.

మధుర: మొగాడే చెప్పాలా యేవిఁటి? ఆడవాళ్ళకి దేవుఁడు నోరివ్వలేదా?

గిరీశం: (తనలో)పూటకూళ్ళముండే చెప్పింది కాబోలు (పైకి) ఆడదా? ఆడదాన్ని నోరుబెట్టుకు బతకమనే దేవుఁడు చేశాడు. పరువైన ఆడది నీ యింటికెందుకొస్తుంది?

మధుర: పరువైన మొగాళ్ళొచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళెందుకురాకూడదు? ముందు కూచోండి, తరవాత కోప్పడుదురు గాని, చుట్ట తీసుకొండి, అదుగో అగ్గిపెట్టి.

గిరీశం: ముట్టుకోడానికి వల్లలేకపోతేఅగ్గిపుల్ల వెలిగించి యివ్వడానికయినా పెట్టిపుట్టాను కానా? యీవాళ మహా ఉత్సాహంగా వచ్చాను గాని ఉత్సాహభంగం చేశావ్‌.

మధుర: యెవిఁటా వుత్సాహం?

గిరీశం: యిదిగో జేబులో హైదరాబాద్‌ నైజాం వారి దగ్గిరించి వచ్చిన ఫర్మానా. మా నాస్తం నవాబ్‌ సదరదలాత్‌ బావురల్లీఖాన్‌ ఇస్పహన్‌ జంగ్‌ బహద్దూర్‌ వారు సిఫార్స్‌ చేసి వెయ్యి సిక్కా రూపాయలు జీతంతో ముసాయిబ్‌ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షావారి హుజూర్న వుండడం.

రామ: (తనలో) యెవిఁట్రా వీడి గోతాలు!

గిరీశం: యింత శుభవార్త తెచ్చినా, దగ్గిరికి రానిచ్చావు కావు గదా? నాతో హైదరాబాద్‌ వస్తావా?

మధుర: (తల తిప్పుతూ) నే యెందుకు? పూటకూళ్ళమ్మని తీసికెళ్ళండి.

గిరీశం: (నిర్ఘాంతపోయి)పూటకూళ్ళమ్మ యేవఁయినా పెంట పెడుతుందా యేవిఁటి?

మధుర: మీకే తెలియాలి.