పుట:Kanyashulkamu020647mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామ: అయితే యింద (జేబులోనుండి నోట్లు తీసి యిచ్చును. మధురవాణి అందుకొంటుండగా రామప్పంతులు చెయ్యి పట్టి లాగును. మధురవాణి కోపంతో చెయి విడిపించుకొని నోట్లు పారవేసి దూరముగా నిలుచును.)

మధుర: మీతో కాలక్షేపం చెయ్యడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషి యేవఁన్నమ్మను?

రామ: (నోట్లు యెత్తి) క్షమించు, అపరాధం, (నోట్లు చేతికిచ్చును) లెఖ్ఖ పెట్టి చూసుకో.

మధుర: ఆమాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానేరాను. యింత రసికులయ్యుండి నా మనస్సు కనిపెట్ట జాలినారుకారు గదా? మీ నోట్లు మీ వద్దనే వుంచండి. నేను డబ్బు కక్కూర్తి మనిషిని కాను. (నోట్లు యివ్వబోవును.)

రామ: వద్దు!వద్దు!వద్దు! నీ మనసు కనుక్కుందావఁని అన్నమాటగాని మరొకటి కాదు. గాని, యీ గిరీశం గుంట వెధవవీడెవడో మా గొప్పవాడనుకుంటున్నావేవిఁటి ?

మధుర: ఆయన్ని నా యదట తూల్నాడితే యిదుగో తలుపు తీశాను విజయం చెయ్యండి. (తలుపుతీసి వొక చేత పట్టుకుని రెండవ చేతి వేలుతో పైకి తోవ చూపును), అదుగో గిరీశంగారే వస్తున్నారు, ఆ మాటేదో ఆయన్తోటే చెప్పండి.

రామ: వేళాకోళం ఆడుతున్నావూ?

గిరీశం: (వాకట్లోనుంచి) మై డియర్‌.

రామ: (ఆత్మగతం) అన్న, వేళగానివేళొచ్చాడు గాడిద కొడుకు, తంతాడు కాబోలు, యేవిఁటి సాధనం, యీ మంచం కింద దూరదాం. (మంచంకింద దూరును.)

[గిరీశం ప్రవేశించును]

గిరీశం: వెల్‌ , మై డియర్‌ ఎంప్రెస్‌. (భుజము మీద తట్టబోవును.)

మధుర: (ఒసిలి తప్పించుకొని) ముట్టబోకండి.

గిరీశం: (నిర్ఘాంతపోయి)అదేమిటి ఆ వికారం.

మధుర: ఆఖరు వికారం.

గిరీశం: (ఆత్మగతం) నేను వుడాయిస్తానని దీనికెలా తెలిసింది చెప్మా! సాని వాళ్ళకి కర్ణ పిశాచి వుంటుంది కాబోలు (పైకి) మైల బడితే స్తానం చేసి వేగిరం రా

మధుర: ఇప్పుడేం తొందర, తలంటుకుంటాను.

రామ: (ఆత్మగతం) చబాష్‌ , యేమి నీతయిన మనిషి యిది! వెధవని ముట్టుకో నివ్వకుండా యెత్తు యెత్తింది!

గిరీశం: మైలా గియిలా మా యింగ్లీషువారికి లక్ష్యం లేదు. యిలా రా (దగ్గరికి చేరును.)