పుట:Kanyashulkamu020647mbp.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరట- నీపుణ్యంవుంటుంది. హాస్యంచాలించు. లేకపోతే కుఱ్ఱవాళ్లకి పెద్దలయందు భక్తి చెడుతుంది.

శిష్యు- నేనేంతప్పుచేశాను? గురువుగారు చెప్పినపనిచేశాను. ఆతప్పూ వొప్పూ ఆయందే.

మధు- యవరేమిచేసితిరో, నాకు తెలియదుగాని, మీయిద్దరికోసం హెడ్‌ కనిష్టీబు గాలిస్తున్నాడు. దొరకగానే మఠప్రవేశం చేస్తాడట. యీ మాటమట్టుకు నాకు రూఢిగా తెలుసును.

శిష్యు- యిదేనా మీరు నాకు చేస్తానన్న పెళ్లి?

కరట- యేమైనా జట్టీవస్తే, నీప్రాణానికి నాప్రాణం అడ్డువెయ్యనట్రా?

మధు- వొస్తే జట్టీ గురుశిష్యులకు యిద్దరికీ వొక్కమారే వస్తుందిగాని, ఒకరికి రావడం ఒకరు అడ్డుపడడం అన్నమాట వుండబోదు. యెప్పుడైనా మీయిద్దరి ప్రాణాలకీ నేను కనికరించి, అడ్డుపడాలిగాని, మరియవడికీ సాధ్యంకాదనుకుంటాను.

శిష్యు- మాగురువుగారి మాటకేం; ఆయనపెద్దవారు; యేవొఁచ్చినా సర్దుకోగలరు. నేను పాపం పుణ్యం యెరగని పసిపిల్లవాణ్ణి, నాప్రాణానికి నీప్రాణం అడ్డువేశావంటే, కీర్తివుండిపోతుంది.

మధు- నీగురువుని వొదిలేసి నాదగ్గిర శిష్యరికం చేస్తావా?

శిష్యు- యిదిగో- యీనిమిషం వొదిలేస్తాను. (బుగ్గలుగాలితో పూరించి పిడికిళ్లతో తట్టి గురువుతో) మీనేస్తం యీవేళతోసరి. మరి ఆడవేషం యీజన్మంలో వెయ్యను.

మధు- నాటకంలోకూడా వెయ్యవా?

శిష్యు- మరి నాటకం గీటకం నాకొద్దు.

మధు- నాదగ్గిర శిష్యరికం అంటే యేవేఁంజెయ్యాలో తెలుసునా?

శిష్యు- నీళ్లుతోడుతాను, వంటచేస్తాను. బట్టలువుతుకుతాను. గాని బ్రాహ్మణ్ణిగదా, కాళ్లుపట్టమనవుగద?

మధు- (విరగబడినవ్వి) యిదా నీగురువుదగ్గిర చేసే శిష్యరికం?

శిష్యు- మరిచిపోయినాను. చిడప్పొక్కులుకూడా గోకుతాను.

మధు- (నవ్వి) పెంకా?

శిష్యు- యేనౌఖరీ చెయ్యమంటే ఆనౌఖరీ చేస్తాను.

మధు- నన్ను ముద్దెట్టుకొమ్మన్నప్పుడల్లా ముద్దెట్టుకోవాలి.

శిష్యు- ముద్దెట్టుకుంటాను.