పుట:Kanyashulkamu020647mbp.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీనా-- యీరావఁప్పంతులే యిలాంటి అపవాదులన్నీ వేస్తూవుంటాడు. కనపడ్డవాడితోఅల్లా వూసు పెడితే, వూరంతా అనుకోరూ? బంగారంలాంటి పిల్లని యిలాంటిమాటలని బెంబేరు పెట్టకండి. తండ్రి వెళ్లిపోయినాడని అది రాత్రీపొగలూ యేడుస్తూంది.

లుబ్ధా-- వెధవతండ్రీ, బోడితండ్రీని! గాడిదకొడుకు రెండో పెళ్లిముండని నా పీకకి ముడేసి అమాంతంగా నాకొంప ముంచాడు. యిహ బతకను యిహ బతకను.

మీనా-- "రెండో పెళ్లిముండ, రెండో పెళ్లిముండ," అని శుభమల్లే అనకండి. మీరే యిలా సాటుతూవుంటే వూరంతా అనడం ఆశ్చర్యవాఁ? మాట్లాడక వూరుకోండి.

లుబ్ధా-- వూరుకోవడ వెఁలాగే? మనవూరా, మనదేశవాఁ? రెండో పెళ్లి ముండ కాకపోతే ఆతండ్రి వెధవ, పేరయినా చెప్పకుండా పారిపోవడవేఁవిఁ?

మీనా-- సిద్ధాంతితో చెప్పాట్టే, పేరు?

లుబ్ధా-- వాడి శ్రాద్ధం చెప్పాడు. సిద్ధాంతి గడియకో పేరు చెబుతున్నాడు.

మీనా-- అతగాడికి మాత్రం కొత్తవాడి పేరు జ్ఞాపకంవుంటుందా యేవిఁటి? మనపిల్ల మనయింట్లో వున్నతరవాత, అతగాడి పేరుతో మీకేంపని?

లుబ్ధా-- యీ పెళ్లాం ముండ నాయింట్లో వుంటే నేను చచ్చిపోతాను; మరిబతకను.

మీనా-- వెఱ్ఱి కేకలెయ్క నోరు మూసుకుని వూరుకోండి. యిరుగుపొరుగువారు నవ్వగల్రు. మీ మావఁగారు యంతపండితుడు, యంతదొడ్డమనిషి! లేనిపోని అనుమానాలు పెట్టుగోకండి. పసిపిల్ల బెంగెట్టుకోగల్దు.

లుబ్ధా-- ఓసి భ్రష్టా! వాడు నీకేవఁయినా యిచ్చాడా యేవిఁటే, వాణ్ణి వెనకేసుకు మాట్లాడుతున్నావు? నీకు నేను చచ్చిపోవాలని వుందికాబోలు!

మీనా-- యేవిఁటా మతిపోయిన మాటలు! అతగాడు రేపో నేడో వొచ్చి, యిలాంటి మాట్లన్నందుకు మన నోట్లో గడ్డిపెడతాడు.

లుబ్ధా-- అతగాడెవడు, వొల్లకాట్లో రావఁనాధాయ! మరెక్కడొస్తాడు వాడు! యిహ, నాకు చావుసిద్ధం.

మీనా-- మీకు చావేం వొచ్చింది యిప్పుడు? ఒహవేళ రెండోపెళ్లి పిల్ల అయితే మాత్రం, గుప్‌చప్‌ అని వూరుకోవాలిగాని, అల్లరి చేసుకుంటారా? యీరోజుల్లో యంతమంది రెండోపెళ్లి చేసుకుని సుఖంగా వున్నారుకారు? పిల్ల బుద్ధిమంతురాలు. మీ అదృష్టంవల్ల దొరికింది. మాట్లాడక వూరుకోండి.

లుబ్ధా-- నా అదృష్టం తగలబడ్డట్టేవుంది. నీకేం పోయీకాలం వొచ్చిందే! నువ్వుకూడా యీ కుట్రలోచేరి, నీతండ్రికి కళ్లుగప్పి వెధవపెళ్లి చేశావే? అయ్యో వెధవని పెళ్లి చేసుకున్న కుంకవెధవా నీ బుద్ధెక్కడికి పోయిందిరా? నీ చదువెక్కడికి పోయిందిరా? నీ వేదం తగలబడనూ - యిహ బతకను!