పుట:Kankanamu020631mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. కలుషమ్మెఱుంగ కొక్కటన పెక్కాట ల
            త్యానందమునఁ గూడి యాడియాడి
   నురుచిరబహుదివ్యసుందరీగాన ర
            తిప్రమోదంబులఁ దేలి తేలి
   మిన్నుమన్నరయ కీయున్నతి స్థిరమంచుఁ
            బోరానియాశలఁ బోయిపోయి
   కటకట! తుదకుఁ బ్రకంపన బాధకు
            లోనై మనంబున లోఁగి లోఁగి

   పొంకమును బింకమును జెడి పొరలువాఱి
   ముడుతలంబడి పెనువాతమున మునింగి
   నీరుగ్రమ్ముచు నాఁడుమానిఖిల మేఘ
   మాలికలు క్రమక్రమముగా నేలవ్రాలె.

ఉ. ఇచ్చటనుండి నేలఁబడనీక ననుం గృపఁ గాచుచున్న మా
   నెచ్చలి మబ్బులన్నియుఁజనెన్, బకువాతఁబడంగఁ బాండవుల్
   సొచ్చినయింటివిప్రునకుఁ జొప్పున నాకును సక్రమంబుగా
   వచ్చెను వంతు మారుతునివాతఁబడన్ విధినిర్ణయంబునన్.

క. బలహీనులమగు మాపై
   బలిసి విరోధించి కూల్పఁబాల్పడిన మహా
   బలుబలమును విధిబలము ప్ర
   బలమగునెడఁ బ్రోచు భీమబలుఁ డున్నాఁడే?