పుట:Kankanamu020631mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంకణము

పూర్వ చరిత్రము


చ.

అణువునయందు మేరుగిరియందును నిత్యము నొక్కరీతి న
య్యనుపమమౌపరాత్పరు మహత్తర తేజము వెల్గుఁగావునన్
గనుఁగొన నొక్క కంకణమెకా యను నీరసభావ మూన కో
యనఘన చరిత్రులార! వినుఁ డయ్య! మదీయకథావిధానమున్.



చ.

జలముల నేర్పడున్ జనదసంచయముల్, జలముల్ జనించున
జ్జలధరజాతమందె; మది సంశయమయ్యె మదీయజన్మమీ
జలజలదంబులం దెటనో; సర్వచరాచరకోటి సాటిగా
నలినభావాండమందెజననంబని మాత్రము విన్నవించెదన్.


చ.

ఖరకరు గ్రీష్మభీష్మకరకాండముఖంబున నెన్నిమాఱు లే
నరిగితినో నభంబునకు, నభ్రమునుండి మఱెన్నిసారు లే
నురనడి జారి భూపతన మొందితినో; బుధులిట్టి జన్మముల్
మరణములుం గణింప రిట మజ్జననక్రమగాథ లేటికిన్ ?


శా.

నాపాపం బది యేమొకాని భువి నానాయోనిసంజాతుఁడౌ
పాపాత్మున్ వలెఁ బెక్కు జీవనములం బ్రాపించుచున్ బుద్బుద
వ్యాపారమ్మున సంచరించితి ననేకాబ్దమ్ము లేతన్మహీ
వాపీకూపనదీనదాదిబహుళాంభశ్శ్రేణి మధ్యంబులన్.