పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'

రెండవకూర్పు పీఠిక.

ఆర్యులారా!

అత్యద్భుతమగు నారద మహర్షి చరిత్ర మిందు వర్ణింపఁబడినది. తొలుత నారదుఁడు బ్రహ్మచే జగత్సృష్టికై దక్షాదులతో సృజింపఁబడియు విరక్తుఁడగుట సృష్టికార్యము నొల్లక పితామహుని శాపమునకు గురియయ్యెను. ఆశాపంబున ఉపబర్హణుఁడను గంధర్వరాజై జన్మించి గానకళా ప్రావీణ్యముచే పార్వతీ మహాదేవివలన "మహతి" యను వీణంబడసి విఖ్యాతినొందెను. మరుజన్మంబున గోపకుమారుఁడై తపస్సిద్ధులకు సపర్యలం గావించి వారి యనుగ్రహమున జ్ఞానియై కాలము గడపెసు. మూడవ జన్మంబున తిరుగా నారదుండై కాంతాపరిగ్రహణ మొల్లిక పితామహు నాజ్ఞ నతిక్రమించి పునశ్శాపోపహతుండై వివాహమాడి అది విడిచి విష్ణుమాయచే కాంతా కృతినొంది సంతానము వడసి తుదకు స్వస్వరూపప్రాప్తి నొంది మహాతపంబు గావించి సర్వముని సార్వభౌముఁడని కీర్తింపఁబడి ప్రసిద్ధినొందెను.

ఇట్లెన్ని శాపంబులు గల్గినను హరిభక్తిని విడువక జ్ఞానియై జితమాయుండై ప్రసిద్ధినొందిన నారదుని దివ్యచరిత్రము జ్ఞానదాయకము రసవంతమునై శోభిల్లుచున్నది.

నారదుని చరిత్ర యనుటచే యెద్దియో గాధయని తొలుత చదువరులకు తోచినను చదువ మొదలిడిన ఇది సుప్రసిద్ధమగు కాశీ మజిలీ కథలందన్నిటియందును మనోహరమైనది యని పాఠకులు గ్రహింపఁగలరు.

దైవానుగ్రహమున నేటికి 12 భాగములు పూర్తికాబడినవి మణిసిద్దయతీంద్రుఁడు గోపకుమారునితో వారణాసిం జేరెను. "జగమెఱిగిన బ్రాహ్మణునకు జేందెమేల" యను నుడువున సుప్రసిద్ధములగు నీకథలను గురించి పెద్దగా వర్ణింప నవసరము లేదు. దీనికి లోకమే ప్రమాణము.

రాజమండ్రి,

ఇట్లు సుజనవిధేయుఁడు

ది 3-12-1934. .

మధిర కొండయ్య శాస్త్రి.