పుట:Jyothishya shastramu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశ్నలన్నీ ఏవైనా కానీ శరీరాంతర్గత కర్మకు సంబంధించినవి కావు. వ్యక్తి కర్మను చూచి చెప్పునవి కావు, కావున అది జ్యోతిష్యము కాదు.

ఏది జ్యోతిష్యమో, ఏది జ్యోతిష్యము కాదో తెలియని పరిస్థితి నేడు కలదు. అదే విధముగా జ్యోతిష్యుడు అను పేరు పెట్టుకొన్న వారిలో చాలామంది ఏది జ్యోతిష్యమునకు సంబంధించిన ప్రశ్నో, ఏది ప్రశ్న కాదో కూడ తెలియని స్థితిలో ఉన్నారు. అటువంటి గందరగోళములోనే కొందరు వాస్తును కూడ జ్యోతిష్యము అంటున్నారు. వాస్తుద్వారా మనిషికి భవిష్యత్తు చెప్పవచ్చు అంటున్నారు. వాస్తవానికి, వాస్తు జ్యోతిష్యము కాదనీ, వాస్తు శాస్త్రమేకాదనీ, జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధములేదనీ చాలామందికి తెలియదు. ఇటువంటి పరిస్థితిలో నెరవేరని వాస్తు ఫలితములను చూచి, అదే విధముగ ప్రశ్నగాని జ్యోతిష్యమును చూచి, వాస్తును నిరూపిస్తే ఐదు కోట్లూ, జ్యోతిష్యము ద్వారా మా ప్రశ్నకు జవాబు చెప్పితే, అది నిజమైతే, పదికోట్లు ఇస్తామని పందెమునకు దిగే నాస్తికులూ, హేతువాదులూ తయారైనారు. ఇదంతయు చూస్తే ఇటు వాస్తును శాస్త్రమని చెప్పే వారికీ, బయటి దానికి జవాబు చెప్పడమునే జ్యోతిష్యశాస్త్రమనే జ్యోతిష్యులకూ, అటు నాస్తికులకూ, హేతువాదులకూ జ్యోతి తెలియదు, జ్యోతిష్యమూ తెలియదు. జ్యోతిష్యము అంటే ఏమిటో తెలియనపుడు దాని పేరు పెట్టుకొని చెప్పే జ్యోతిష్యశాస్త్రులుగానీ, అదేమిటని ప్రశ్నించే నాస్తికవాదులుగానీ ఇద్దరూ ఒక కోవకు చెందినవారేనని చెప్పవచ్చును. జ్యోతిష్య శాస్త్రులు, నాస్తికవాదులూ ఇద్దరూ అసలైన జ్యోతిష్యమంటే ఏమిటో తెలియాలనికోరుచున్నాము.