పుట:Jyothishya shastramu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. జ్యోతిష్యము శాస్త్రమా?

జ్యోతిష్యము శాస్త్రమా? కాదా? అని చాలామందికి ప్రశ్నగానే ఉన్నది. కొందరు శాస్త్రమంటున్నారు, కొందరు శాస్త్రము కాదంటున్నారు. చెప్పినది నెరవేరినది కదా అందువలన జ్యోతిష్యము శాస్త్రమే అని కొందరు అంటున్నారు. చెప్పినవి చాలా నెరవేరలేదనీ, అందువలన జ్యోతిష్యము శాస్త్రము కాదు అని చాలామంది అంటున్నారు. ఎవరి మాట నిజమని యోచిస్తే, వీరు జ్యోతిష్యము కాని దానిని పట్టుకొని ఒకటి నెరవేరింది కావున శాస్త్రమనీ, పది నెరవేరలేదు కావున శాస్త్రము కాదనీ అంటున్నారు. చీకటిలో పాముకాని తాడును చూచి వంకరగ ఉన్నది కాబట్టి పాము అంటే, కదలలేదుకదా పాము కాదేమో అని మరొకడు అన్నట్లు, అసలు జ్యోతిష్యము కాని దానిని పట్టుకొని నేనన్నది నెరవేరింది కదా! అందువలన ఇది శాస్త్రమే అని ఒకడూ, మేము అడిగింది నెరవేరలేదు కదా! అందువలన ఇది శాస్త్రము కాదని మరికొందరు అన్నట్లున్నది. చీకటిలో పాము అనుకొన్నది అసలు పామో కాదో, అలాగే జ్యోతిష్యము అనుకొన్నది జ్యోతిష్యమో కాదో చూడవలసిన అవసరమున్నది. అలా చూస్తే మనమనుకొన్నది జ్యోతిష్యము కాదు కనుక, దానిని శాస్త్రమా కాదా అని చూడవలసిన పనేలేదు. జ్యోతిష్యమన్నది ఆత్మజ్ఞానమున్నవారూ, కర్మ విధానము తెలిసిన వారూ, పాపపుణ్య ఫలితములను తెలిసినవారూ, చెప్పునదని తెలియుచున్నది. కర్మంటే ఏమిటో తెలియనివారు, ఆత్మంటే ఏమిటో తెలియనివారు చెప్పునది జ్యోతిష్యము కానేకాదు. ఎలాగైతే ఏమి, ఆత్మజ్ఞానులు, కర్మజ్ఞేయులు తెలిసిన జ్యోతిష్యమనునది ఒకటున్నదని తెలియుచున్నది. ఇపుడు జ్ఞానులు చెప్పు జ్యోతిష్యమును శాస్త్రము అనవచ్చునా! అని అడిగితే తెలియు వివరము ఏమనగా!