పుట:Jyothishya shastramu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
35. చిత్ర పటము

మనిషి జీవితములో పెళ్ళికాని ముందు జీవితము ఒక విధముగా జరుగగా పెళ్ళి అయిన తర్వాత జీవితము మరొక విధముగా జరుగును. పెళ్ళి కార్యముతో వచ్చునది భార్య. భార్యను జీవిత భాగస్వామియనియూ, అర్థాంగి అనియూ అనడము జరుగుచున్నది. అర్థాంగి అను పదమును విడదీసి చూచితే అర్థ+అంగీ=అర్ధాంగీ అని తెలియుచున్నది. అంగ అనగా శరీరము అనియూ, అంగీ అనగా శరీరమును ధరించినదనియూ అర్థము. ‘అంగ’ అను పదమునుండి ‘అంగీ’ అను పదము పుట్టినది. అర్ధాంగి అను పేరు భార్యకుండుట వలన కర్మచక్రములోని 12 భాగములలో అర్థ భాగమును వదలి, మిగత అర్థభాగము ప్రారంభమగు ఏడవ స్థానములో భార్య యొక్క కర్మ వ్రాయబడియున్నదని తెలియవలెను. భార్య భర్తలో సగము శరీరముకలదని అర్థనారీశ్వర చిత్రము తెలియజేయుచున్నది. అందువలన కర్మ పత్రములోని పన్నెండు భాగములలో సగము తర్వాత వచ్చు ఏడవ స్థానములో భార్యకు సంబంధించిన కర్మను లిఖించడమైనది.