పుట:Jyothishya shastramu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15) కొంతమంది తమ పొలము దగ్గర దారి సరిగా లేక ఇబ్బంది పడుచుందురు. అట్లే కొంతమంది తమ ఇంటివద్ద దారిలేక ఇబ్బంది పడుచుందురు. అదెందుకు జరుగుచుండును?

జ॥ ప్రపంచములో ప్రతి దానికీ గ్రహములే అధిపతులు. అట్లని గ్రహములను దేవుళ్ళని అనుకోకూడదు. ప్రభుత్వము నుండి కరువు సహాయము అందినప్పుడు మొదట ఆ డబ్బు జిల్లా కలెక్టర్‌వద్దకు వచ్చి, కలెక్టర్‌నుండి మండల ఆఫీసర్‌వద్దకు వచ్చి చివరకు బ్యాంకు క్యాషియర్‌ ద్వారా నీకు వచ్చినదనుకొనుము. ప్రతి సహాయము ఎక్కడినుండి డబ్బు వచ్చినా బ్యాంకు క్యాషియర్‌ నుండే తీసుకోవలసియున్నది. అట్లని క్యాషియర్‌నే ప్రభుత్వము అనుకోకూడదు. అలాగే గ్రహములు ఉన్న కర్మను ఇచ్చు క్యాషియర్‌లాంటివి. మనిషికి సృష్ఠినుండి ఏది లభించినా గ్రహముల ద్వారానే లభించాలి. గ్రహములన్నియూ ప్రకృతి ఆధీనములో ఉండగా, ప్రకృతి పరమాత్మ ఆధీనములో ఉన్నది. చివరికి అన్నిటికీ పెద్ద దేవుడే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే భూమిమీద దారులన్నీ కుజగ్రహము ఆధీనములో ఉండును. జాతకములో కుజగ్రహము వ్యతిరేఖియై నాల్గవ స్థానములోయున్న, నాల్గవ స్థానమును తన చేతితో త్రాకినా, పొలములు గృహముల దారులలో ఆటంకములు ఏర్పడును. తరచూ త్రోవలకు సంబంధించిన పేచీలు వచ్చుచుండును. కుజుడు దక్షిణ దిశకు అధిపతియైనందున దక్షిణ దిశకున్న దారులలోనే ఎక్కువ పేచీలు వచ్చును. దారులేకాక ఇళ్ళు కూడా దక్షిణమువైపు కృంగుటయో లేక దక్షిణవైపు గోడలు చీలుటయో జరుగుచుండును. ఇటువంటి కుజ దోషములకు ఏ గృహశాంతులుగానీ, అష్టదిగ్భంధన యంత్రములుగానీ, ఏ విధమైన ఉపశమన మార్గములూ పనికిరావు.