దొక దానిపొడుగు అంగుళములో 12,500-వ భాగముండును. అనగా నిది వికారిణికంటె 125 రెట్లు చిన్నది. దీని వెడల్పు పొడుగులో 8-వ వంతుండును. అనగా వీనిని ఒకదానిపై నొకటి నరిసెలదొంతరవలె పేర్చినయెడల నొక అంగుళముఎత్తు దొంతవరకు రెండులక్షలు పట్టును.
ఏదైన నొక ద్రవపదార్థము మునుగునప్పుడు దానిపైని కొంతకాలమున కొక తెట్టెకట్టునని చెప్పియుంటిమి. సూక్ష్మజీవులు కొంతకాలము చురుకుగా సంచరించినపిదప పైకి తేలి తోక లూడి జిగటగా నుండు జాంతవము (Gelatine) అను పదార్థము నొకదానిని వెడలగ్రక్కి యాపదార్థములో పొదుగుకొని నిశ్చలనము నొందినవగును (సూ. త. లో కుడిప్రక్కను చూడుము). ఈ జాంతవము మాంసకృత్తు సంబంధమైనది. స్వచ్ఛమైన యీ జిగటపదార్థములో పొదుగుకొని నిశ్చలనమునొంది తేలుచుండెడు అపారమైన సూక్ష్మజీవుల సముదాయమే పైనిచెప్పిన తెట్టె. వికారిణి కొంతకాలము చురుకుగ వ్యవహరించి యొకానొకప్పుడు నిశ్చలనము నొంది గూడుకట్టుకొనునని చెప్పియుంటిమి. అట్లే సూక్ష్మజీవులకుగూడ నిట్లు తెట్టె కట్టుకొనుట విశ్రమస్థితి యని యెఱుంగునది.
మురుగుటకు ప్రారంభించిన కషాయమునందు మొట్టమొదట సూక్ష్మతర్కువులుమాత్రమే యుండవచ్చును. మురిగిన కొలది నితరజాతులు సామాన్యముగా కన్పట్టును.