Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముచే కొంత కాలమువరకు వికారిణులు వృద్ధిబొందుచు, ఒకానొకప్పుడు రెండు వికారిణు లొకదానిప్రక్క నొకటి చేరి తుదకొకవికారిణిలో రెండవది ఐక్యమగును. ఇట్లు మిళితమగుటకు సంయోగ (Conjugation) మని పేరు. ఇట్లైక్యమగుటవలన గలుగు సంయుక్త వికారిణి, ఐక్యమగుటకు పూర్వమందున్న రెండు వికారిణులకంటె చురుకుగా మేయును, చలించును, సంతానవృద్ధి నొందును. కాబట్టి సంయోగము రెండవవిధమైన సంతానవృద్ధి యని చెప్పనగు.

మూడవవిధానమును గలదు. వికారిణిని కొన్ని ముక్కలుగా విభజించిన యెడల ఆ ముక్కలలో జీవస్థానముగల ఒక్కొక్క ముక్కయు పెరిగి సర్వవిషయములను తల్లినిబోలియుండును. జీవస్థానమునందలి భాగము ఈషన్మాత్రమైనను లేనిముక్క చచ్చును. జీవస్థానము జీవులయొక్క ప్రాణసంబంధమైన ధర్మములను నడుపుటయందు ముఖ్యమైనది గావుననే దీనికి ఇట్టిపేరు గలిగెను.

6. మరణము:- వికారిణియొక్క వ్యాపారములలో నారవది చచ్చుట. వికారిణికి ఉనికిపట్టయిన గుంట లెండిపోవునప్పు డది చచ్చునని చెప్పియుంటిమి. అట్లు చచ్చినప్పుడు దానిమూలపదార్థము కుళ్లి ప్రాణవాయువుతో గలసి బొగ్గుపులుసుగాలియును, నీరును, నత్రజనసంబంధమైన పదార్థములును అగును.

సంగ్రహము-వికారిణియొక్క వ్యాపారము లారు:

1. చలనము (Motion)

2. పోషణము లేక ఆహారము తినుట (Nutrition)