పోసినట్లుగా నొక బీట కలుగును. క్రమముగా నా బీట పెద్దదయి తల్లివికారిణిని రెండు పిల్లవికారిణులుగా ద్రుంచును. (E.చూడుము). ఈ రెండుపిల్లలును అప్పటినుండియు స్వతంత్ర జీవనము చేయును. ఇట్టి సంతానవృద్ధికి ద్విఖండన మనిపేరు. ద్విఖండన మనగా రెండుగా విభజింపబడుట.
ఈ విషయమున మన వికారిణికిని, హెచ్చు జాతి జంతువులకును గల భేద మాలోచింతము. ఒకపిల్లి కొంతకాలమున కొకసారి పిల్లలు పెట్టును. ఆపిల్లలు పరిమాణమునందు తప్ప తక్కిన సర్వవిషయములయందును తల్లిని బోలియుండును. తల్లిపిల్లి ఈప్రకారము కొన్ని సంవత్సరములవరకు పిల్లలను పెట్టిపెట్టి తుదకు ముసలిదై మృతినొందును. తల్లివికారిణి తనను బోలియుండు రెండు పిల్ల వికారిణులుగా చీలును. ఇట్లు చీలునప్పుడు తల్లికి స్వతంత్రాస్తిత్వ ముండదు. అనగా తల్లి వికారిణి వేరుగా లేదు. తల్లి యే తన రెండుపిల్లలుగా మారినది. పై నుదాహరించిన పిల్లి విషయములో తల్లిపిల్లియును, పిల్ల పిల్లులును వెవ్వేరుగా నేర్పడుచున్నవి. మరియు తల్లిపిల్లి కొంతకాలమునకు చచ్చును. తల్లివికారిణికి ఎన్నడును చావు లేదు. ఏలయన, తల్లియొక్క రెండుసగములును తనబిడ్డలుగా నేర్పడి వృద్ధిబొందుచుండుటచేత ఆపిల్లలరూపమున తల్లి చిరంజీవియై యుండును.
సంయోగము:- పై జెప్పిన సంతానవృద్ధి జూడ వికారిణికి స్వాభావిక మరణము లేదని చెప్పవచ్చును. ఇట్లు ద్విఖండనవిధాన