పుట:Jeevasastra Samgrahamu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుక్తబీజము ప్రథమమున రెండు కణములుగా చీలును. అందు క్రిందికణము పిండకణము. పైకణము ఉపరికణము. 86-వ పటములో A-చూడుము.

ఈ పిండకణము సమకోణములుగానుండు మూడుకోతలచే నెనిమిదికణములుగా చీలి అవి మరల, 16, 32, 64, ఇత్యాది యనేక కణము లై యాకణము లన్నియు గూడి యొక బంతివలె గుండ్రముగ నుండు కణసముదాయ మగును. ఇది యనేకకణములుగల మల్బెరీదశ (205-వ పుట చూడుము) యని చెప్పనగును. ఉపరికణముగూడ కొన్ని కణములుగా చీలి యాకణములన్నియు నొక గొలుసువలె నొకదానికొన నొక టంటియుండును.

ఈ గొలుసుమూలమున మల్బెరీపిండము పిండతిత్తియొక్క గోడనుండి వ్రేలాడు చుండును (పటములో C). పిమ్మట నీకణములలో ననేకమార్పులు గలిగి తుదకు గొలుసునుండి చిన్నముక్కువలె నుండెడు ప్రథమమూలము (Radicle) అను వేరుయొక్క ప్రాతిపదికయగుభాగమేర్పడును. 86-వ పటములో E లో ప్ర. మూ. చూడుము. బంతివంటి క్రిందిభాగమునుండి ఆయాజాతుల ననుసరించి యొకటిగాని రెండుగాని బీజదళములును (Cotelydons బీ. ద.), ప్రథమశాఖాంకురమును (ప్ర. శా Plumule) అనగా మొట్టమొదటి కొమ్మయొక్క అంకురమగు మొటిమయును నేర్పడును.