Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై జెప్పినవిషయముల గ్రహించునిమిత్తమై మొట్టమొదట రెండు బీజదళములుగల జాతిలోనిదగు చిక్కుడుకాయను పరీక్షించి చూడుము.

చిక్కుడుకాయయొక్క నిర్మాణము.

చిక్కుడుకాయపై నెండియుండెడు గుల్ల చిక్కుడుపూవునందుండు ఒక అండాశయముయొక్క పొట్ట; దీనికే ఫలకవచమనిపేరు. దీని మొదటిభాగమున తొడిమ గలదు. చివరభాగమున చిన్న కాడ ముక్కువలె వంగియుండును; ఇది కొనకాడ. కాయలోపల నొక్కటె అర గలదు. కాయయొక్క నడిమియీనెకు ఎదురుగనుండు తలగడవంటి దిమ్మ నంటియుండు గింజలు స్థూలబీజాశయములు. ఈ తలగడకు అండపోషకమని పేరు. అండపోషకమనగా గింజలకు అండాశయముయొక్క పొట్టనుండి యాహారము తెచ్చి పోషించుమావి. ఈగింజలను ఒకదినము నాననిచ్చి యందొక దానిని క్రింది విధమున పరీక్షింపుము. ఈ గింజయొక వైపున వెలుపలి కుబ్బి వట్రువగను మరియొక వైపున నడుమ లోటుపడి గుంటగను ఉండును. లోటుగనుండు వైపునం దొకభాగమున తెల్లనిమచ్చయొకటి గలదు. ఈ మచ్చ అండాశయము యొక్క తలగడను గింజ యంటియుండుచోటు. ఇట్లు నానినగింజను కొంచెము నొక్కినయెడల నీ మచ్చప్రక్క నుండెడి యొక చిన్న రంధ్రముగుండ నొక నీటిచుక్క బయలువెడలును. ఈ రంధ్రమే సూక్ష్మరంధ్రము.