ప్రత్తిగింజల చుట్టును అంటియుండు ప్రత్తిపోగులు ఆగింజయొక్క రోమములు. మనతలమీదనుండు వెండ్రుకలు మన కెట్టివో, అవియు నాగింజ కట్టివియే. అయినను వానియుపయోగమునందు భేదము కలదు. ఇట్టి తేలికైనరోమముల సహాయముచే నీగింజలు ఎగిరిపోయి మరియొకచోటికి జేరగలవు.
చీపురుముండ్ల తోకలుండుట వానియందలి గింజలను స్థలాంతరమునకు గాలిలో నెత్తుకొనిపోవుటకు రెక్కలుగా నుపయోగించు నిమిత్తమే యని యెరుంగునది.
3. నీరు:- కొన్నిగింజలపై నేర్పడియుండు కవచములు నీటిని చొరనియ్యనివగుటచేత నా గింజ లెంత దూరమైనను నీటిలో కొట్టుకొనిపోయి తగినస్థలము దొరికినప్పుడు మొలచును. ఉదా:- కలువయు, తామరయు, గల్జేరు, లింగమిరము మొదలగు గడ్డిజాతుల విత్తనములును ఈవిధమున వ్యాప్తినొందును. ఇట్టిగింజలు పక్వమునకు రాకమునుపే నీరు గింజలలోనికి ప్రవేశించినయెడల ఆగింజలు క్రుళ్లిపోవును. ఈయవాంతరము గలుగకుండ వానిపై పొరలలో నేదో యొకటి మిక్కిలిదట్టమై నీటిని చొరనియ్యనిదగును. ఈతగింజ, మామిడి టెంక వీని యొక్క దృఢమైనకవచములను చూడుము.