Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గూర్చి సంక్షేపముగమాత్రమే వ్రాయుచు, వానికిని, మన మిదివరకు చదివియున్న నాచు, వారిపర్ణి మొదలగు మొక్కలకును గల తారతమ్యములను సూచించెదము. హెచ్చుజాతివృక్షము లనగా పూవులుపూయు వృక్షములు. మామిడిచెట్టు, కొబ్బెరచెట్టు మొదలగునవి. వీనికిని నాచుమొక్కకువలెనే ఆకులు, కొమ్మలు, వేళ్లు గలవు. ఆకులు వెలుతురువైపునకు, అనగా, పైవైపునకు పెరుగుచుండును. వేళ్లు భూమిలోనుండు నీళ్లవై పునకును, చీకటివైపునకును, అనగా క్రిందివైపునకును బోవుచుండును. నాచుమొక్క యందలి వేళ్లకుమాత్రము వాని సూక్ష్మనిర్మాణమునందలి భేదములచే నులివేళ్లు అని పేరుగలిగె. నిజమైన వేళ్లనిర్మాణము తెలిసికొనునప్పు డీ భేదములను గ్రహించగలము. ఈ శాఖ ఆకు, వేరు అను మూడుభాగములగూర్చి రాగల మూడుప్రకరణములలో వివరించెదము.

పిమ్మట వాని పూవులయొక్క నిర్మాణమును వివరించుచు, అవి సంతానవృద్ధి కలిగించుట కెట్లు తగియున్నవో సూచించెదము. తరువాత గర్భవతులయిన పూవులనుండి పుట్టిన కాయలయొక్క వ్యాపారములను నిర్మాణములును కొంతవరకు వర్ణించెదము.