పుట:Jeevasastra Samgrahamu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిమిత్తమై యాహారము సంపాదించిపెట్టుపని ఈకణములు తమకు లేకుండ జేసికొనినవి. కాబట్టి యీ కణములు బలమునిచ్చునవిగను సంరక్షించునవిగను ఉన్నవి. నాచుమొక్కయొక్క కణముల పేరుపులో గమనించవలసిన అంశ మింకొకటి గలదు.

ఒక సాలెవాడు బట్టలు నేయునప్పుడు కొన్నివస్త్రములు కట్టుకొనుటకుగాను కొంచెము ముతుకనూలుతోను, మరికొన్ని తలపాగలకుగాను సన్ననూలుతోను నేయుచుండును. ఆయాసరకులను తయారుచేయునప్పుడు వాని యుపయోగములకు తగియుండుటకుగాను ఆ నూలుపోగుల నొక్కొకచో నొంటిగను, మరియొకచో జంటగను, వేరొకచో మిక్కిలిబలముగ నుండుటకై ముప్పేటగను నెట్టుచుండును. అట్లు నేయునప్పుడు తన కనుకూలపడురీతిని అంచులలో పట్టుపోగులను, జరీపోగులను, మధ్య నూలుపోగులను, ఉపయోగించుచుండును. ఇట్లే నాచుమొక్కయందును వెలుపలనుండుఅంచు బలముగనుండుటకై నారపోగులవంటి దృఢకణముల (Sclerenchyma) తోను, నట్టనడుమ నుండు గుంజువంటి మెత్తని పదార్థము పలుచని కణకవచములుగల మృదుకణముల (Parenchyma) తోను అల్లబడియున్నవి. అంచులనుండు జరీ పట్టులవంటిది దృఢకణములవరుసలు. మధ్యనుండు సామాన్యమైననూలు వంటిది మృదుకణములవరుసలు.

కణసంహతులు.

ఒకదానినొకటి బోలియుండుకణము లనేకములు మొట్టమొదటనుండి గుంపులుగా జేరి, యొక్కొకగుంపునందలి కణము