2. ఖండనము :- ఒక హైడ్రాను అనేక ముక్కలుగ నరికినయెడల అందు ప్రతిముక్కయు, తగినయాహార ముండునెడల పూర్ణమైన హైడ్రాగా తయారగును. ఇట్లు నరికివేయబడినభాగములు తిరిగి పెరుగునప్పుడు, పిల్లహైడ్రాలయందలి బహిశ్చర్మకణములు పూర్వపు బహిశ్చర్మకణములనుండియే పుట్టును. అంతశ్చర్మ కణములు తల్లిహైడ్రాయొక్క అంతశ్చర్మకణములనుండియే పుట్టును. కాని యొకవిధమైన కణములనుండి వేరొకవిధమైన కణములు పుట్టనేరవు. పూర్వకాలపు శోధకులలో నొకరు హైడ్రాయొక్క లోపలితట్టు వెలుపలికివచ్చునట్లుగా తిరుగదీసి, యది మునుపటివలె జీవింపగలదని తలచిరి కాని యట్లు కానేరదు. దీనికి కారణము అంతశ్చర్మ బహిశ్చర్మ కణముల వ్యాపార భేదముల నాలోచించిన తెలియగలదు.
స్ఫోటనవిధానమున సంతానవృద్ధి అనంతముగ జరుగ నేరదు. జరిగినను బలహీనకరము. అప్పటప్పట స్త్రీపురుషులజీవస్థాన పదార్థముల మిశ్రణ ముపయోగకరము. ఇట్టి మిశ్రణము స్త్రీపురుషసంయోగ సంబంధమైన సంతానవృద్ధివిధానముచే గలుగును.
II. సంయోగజనిత సంతానవృద్ధి.
సూక్ష్మస్థూలబీజాశయములు రెండు నొక్క హైడ్రాయందే యుండును. కావున హైడ్రా ఉభయాంగి, అనగా హైడ్రా యర్ధనారీశ్వరునివలె కొంతవరకు ఆడుదియు, కొంతవరకు మగదియుగా నున్నది. బీజాశయములు బహిశ్చర్మమునందలి మధ్యకణములనుండి పుట్టును. అందు సూక్ష్మబీజాశయములు క్రీవాయి సమీప