1. స్త్రీపురుష సంయోగరహిత సంతానవృద్ధి.
1. స్ఫోటనము (Budding) :- పూర్తిగా నాహారముగలయప్పు డీహైడ్రా స్ఫోటనవిధానముచే సంతానవృద్ధి నొందును. ఇట్టి సంతానవృద్ధి చెట్లకు కొమ్మలు పుట్టునట్టిదియే. కాని యాకొమ్మ లెల్లప్పుడు తల్లిచెట్టుననే యంటియుండి జీవించుచుండును. హైడ్రాయొక్క శాఖలు పూర్ణముగా తయారయినపిమ్మట తల్లినుండి వీడిపోయి ప్రత్యేక హైడ్రా లగును. ఏదోయొక చోట అంతశ్చర్మ బహిశ్చర్మకణములు రెండును తక్కినచోట్లకంటె వేగముగ పెరిగి యొక మొటిమగా వెలుపలికి ఉబికియుండును. ఈ మొటిమలోనికి జీర్ణాశయముయొక్క పాయ పిల్లగొట్టముగా వ్యాపించును (27-వ పటములో C-లో పి. చూడుము). ఈమొటిమ క్రమముగా పెద్దది కాగా దాని చివరమీసము లొకటొకటిగా పుట్టును. తోడనే యామొటిమయొక్క చివరభాగమున మీసములమధ్య నొకబీట గలిగి యది యాపిల్ల హైడ్రాకు నోరుగా నేర్పడును. పిమ్మట కొంతకాలమునకు పిల్లహైడ్రాయొక్క మొదటిభాగమున, తల్లికిని పిల్లకును మధ్యనున్న అతుకులో ఉరిబోసినట్లుగా నొక్కుకొనిపోయి జీర్ణాశయము రెండుగావీడిపోవును. తుద కీ పిల్ల హైడ్రాతల్లినుండి వీడిపోయి తనబ్రతుకు తెరువు తాను చూచికొనును. ఒక హైడ్రాయం దిట్టిమొటిమ లనేకము లొక్కసారిగా పెరుగవచ్చును. ఈ ప్రకారము ఒక్కొకహైడ్రా కొద్దిమాసములలో 50 హైడ్రాలుగా వృద్ధిబొందును.