సాగదీయగా నయినపోగు ఒక్కటే గొట్టముగా నుండక దానియందు కొంతకొంత పొడుగున కొక్కొక అడ్డగోడ ఏర్పడుచుండునని యూహించిన నీ పోగులోని యరలన్నియు నెట్లు ఒకదాని నొకటి బోలియున్నవో తెలిసికొనవచ్చును. బూజు పోగునందు ఈ అరలన్నియు నొక్కవరుసగా నుండుటచేత నొక్కటే గది వరుసను కట్టిన దుకాణపుకొట్లవలె నుండునని యూహించవచ్చును. ఈగదుల నొక్కొకదాని నొక్కొక కణమునకు పోల్చవచ్చును.
ఈవరకు జదివిన ప్రాణులన్నియు నొక్కొక టొక్కొకకణమే. అనగా వానిమూలపదార్థ మెడతెగక యుండును గాని, అడ్డగోడలచే గదులుగా విడదీయబడియుండదు. కాన వానికి ఏకకణ ప్రాణు లని పేరు.
కణ మనగా మూలపదార్థపు సముదాయము. కణమునకు కవచ మావశ్యకము గాదు. వికారిణివంటి జంతుజాతి ప్రాణియందు కణకవచ ముండదు. వృక్షజాతి జీవులయందు సెల్లులూసుతో జేయబడిన కణకవచము తప్పక యుండును. కణమునకు జీవస్థాన మావశ్యకము. అది లేనిచో కణము జీవింపనేరదు. ఈ విషయము లింతకుపూర్వమే వివరింపబడినను జ్ఞాపకార్థమై యిక్కడ మరల ప్రస్తావింపబడినవి.
బూజుపో గిదివరకు జదివినవానివలె ఏకకణప్రాణి గాక అనేక కణములకూర్పుచే నేర్పడినది. మధుశిలీంధ్రకణములను కొంచెము పొడుగుగా సాగదీసి ఒక దారమున వరుసగా నొక దానిప్రక్క