నేను నేర్చి సాధనం చేసిన శాస్త్రీయ సంగీతం, నేను ముందంజవేసి సాధించిన లలిత సంగీతం, నేను శ్రమించి సేకరించిన జానపద సంగీతం ఈ మూడు నా దృష్టిలో, ఒకే సంగీతార్ణవంలో కలిసే మూడు జీవస్రవంతులని నా నమ్మకం. నా చిన్నప్పటి కచేరీలలో ఈ మూడింటికీ సమాన స్థానమిచ్చి గౌరవించేదాన్ని.
శాస్త్రీయ సంగీతంలో లాగే, జానపద సంగీతంలో కూడా, ప్రతి రాగము సంపూర్ణంగా ఉండాలని మనం అనుకోకూడదు. జానపద సంగీతానికి ఏ శాస్త్రగ్రంధాలూ ప్రమాణాలు కావు. వాళ్ళ హృదయాలే వాళ్ళకు ఆధారం. అందువల్ల అనుకోకుండా కొన్ని పాటలు పూర్తి రాగాల్లొ దొర్లినా చాలవరకు వాళ్ళ పాటల్లో రాగచ్ఛాయలు మాత్రమే కనపడుతూ ఉంటాయి. అందుకే నా యీ పుస్తకంలో రాగం పేరుకాక, ఫలానా రాగస్వరాలు అని మాత్రమే వ్రాశాను. తరచుగా హనుమతోడి (8), వకుళాభరణం (14), మాయామాళవగౌళ (15), నటభైరవి (20), కీరవాణి (21), ఖరహరప్రియ (22), హరికాంభోజి (28), ధీర శంకరాభరణం (29) ఈ మేళకర్తలకు చెందిన రాగాల్లోనో, రాగచ్ఛాయల్లోనో జానపదుల పాటలు ఉంటూంటాయి. అవి వాళ్ళ మనస్తత్వాలకి ఎక్కువ సన్నిహితమైనది అనిపిస్తుంది. ముఖ్యంగా, నాటకు రంజి, నవరోజు, యదుకుల కాంభోజి, రేగుప్తి, ఆనందభైరవి, ముథారి, వాళ్ళకి అభిమాన రాగాలా అనిపిస్తుంది.
అదే విధంగా, ఏ సంగీతానికైనా సరే అలంకారం గమకాలే, శాస్త్రీయ గాయకుల్లాగే జానపద గాయకులు, గమకాలను దశవిధాలుగా విభజించి, ప్రయత్న పూర్వకంగా వాటిని ప్రయోగించక పోవచ్చునుగాని, ఆ గమకాలన్నీ వారి సంగీతంలో అప్రయత్నంగా దొర్లుతూనే ఉంటాయి. జంటదాలు, స్ఫురికం, కంపిత, హరిసికం - లాంటి గమకాలన్నీ జానపద గేయల్లో ఉండనే ఉన్నాయి. పోతే గాత్రానికి గమకం అనేది ఉగ్గు పాలతో అలవడుతుంది.