పుట:JanapadaGayyaalu.djvu/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగువారి జానపద సంగీతానికి, శాస్త్రీయ లలిత సంగీతాలతోపాటు ఒక గౌరవస్థానం, సభార్హత, వచ్చాయంటే, దానికి ముఖ్య కారకురాలిని నేనని చెప్పుకోక తప్పదు. నా చిన్ననాటి నుంచీ జానపద గేయాలు సేకరించడం, పాడడం, నాకు సరదా. నేను పుట్టిన ఊరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాకినాడ. ఆ ఊరికి కాస్త పట్నవాసపు పోకడ పల్లెటూరి వాతావరణం ఉండేవి. దాని ప్రతిబింబాన్ని నేను. నా చిన్నప్పుడు మా మామయ్య కృష్ణశాస్త్రి ఊరైన పిఠాపురం వెళ్లాలంటే బస్సులు లేవు. రెండెడ్ల బండిలో వెళ్లేవాళ్లం. త్రోవలో పొలాల్లో పాడుకునే పాటలు, పిఠాపురంలో, పొన్నాడమంద బయల్లో సత్యభామ కట్టిన భామాకలాపం, రథోత్సవాలలో చెక్క భజనలూ, తప్పెటలూ, కోలాటాలూ, తోలుబొమ్మలూ, వీధినాటకాలూ, మా ఊరు ఉప్పుటేరు గట్టున పడవవాళ్లు పాడుకుంటే పోయే పాటలు, ఇంటిప్రక్క ఆముదం ఫ్యాక్టరీలో పనివాళ్ల పాటలు, మా నూకాలమ్మ గుడివద్ద సంవత్సరాది సంబరంలో ఆడించే గరగలూ, సిరిబొమ్మా - ఇవన్నీచూసి, ఉత్తేజితురాలు నయి, ఆ పాటలను తు.చ. తప్పకుండా గ్రహించి, సేకరించి, నేర్చి, పాడేదాన్ని. చుట్టుప్రక్కల గ్రామాల్లో తీర్థాలూ, జాతరలూ, జరిగాయంటే, అక్కడికి నేను మా నాన్నగారితో వెళ్లడం, ఆ జానపద వినోదాలు చూసి, ఆ పాటల్ని సేకరించడం జరిగేది. ఆ అభిరుచే నాలో ఒక ఉద్యమంగా రూపొంది, జానపద రచనల్ను, వాటి సంగీతాన్ని సేకరించి, పొందుపరచి, ప్రచారంలోకి తేవడం నా జీవితాశయం అయింది. నాయీ ఆశయాన్ని, అభిరుచినీ, పెంపొందించిన వారు జానపద సంగీత పితామహులు, కీ.శే. వల్లూరి జగన్నాధరావు గారు. కర్ణాటక, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాల్లో పాండిత్యం కలిగి, జానపద సంగీతంలోని మెళకువల్ని, మాధుర్యాన్ని గ్రహించి, నాకనుగ్రహించిన వారు. జానపద గేయాలకు నా గ్రాత్రం బాగుంటుందని గుర్తించి, నాల్గవ ఏటనే నాచేత, ప్రఖ్యాత గేయం "అయ్యోకొయ్యోడ", ఇంకా ఎన్నో జానపద గేయాలు, గ్రామఫోను రికార్డులు ఇప్పించారు. దానికి నేనెంతో ఋణపడి ఉన్నాను.