పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎల్లమందమూర్తి భార్య ముద్దు పెట్టుకొనటమే గమనించనివానిలా అయిపోయాడు. తాను ఏదో ఆలోచనా లోకానికి పోయినాడు. ఆ పరధ్యానంలో భార్య మోము చూడని చూపులతో చూస్తున్నాడు. జెన్నీ మూర్తి విశాల ఫాలము నల్లనిదైనా మోములోని కాంతీ, ఆతని అవయవ స్పుటత్వమూ గమనిస్తూ కూచుంది.

ఇంతలో ఒక ఉరుకు ఉరికి భార్య చంకలో చేతులు పెట్టి పైకి గబుక్కున ఎత్తి “నా ప్రాణప్రియా! నీ మాటలు నాలో ఏ మూలనో ఒదిగి ఉన్న కొత్త ఆలోచనలను స్పందించి పైకి తీసుకు వచ్చాయి.” అని ఆమెను హృదయం మీదకు దింపుకొని ఆమెను మోమంతా ముద్దుపెట్టుకొన ప్రారంభించినాడు. “నువ్వు నాకు దేవతవు, నాకు గురువువూ!”

“ఏమిటి నీ కొత్త ఆలోచన ప్రియతమా!”

“ఆ కొండ చరియనుండి బరువు వల్లగాని ఇంకో కారణంవల్లగాని రాళ్ళు కదిలి క్రిందికి జారిపోకుండా, సిమెంటు కాంక్రీటుతో గట్టిచేస్తాను. ఇంటి పైన కురిసే నీరుకు ఎల్లాపోయే ఏర్పాటు చేస్తారో అలాగే ఈ జలాశయం చుట్టుపక్కల కొండలలో కురిసిన నీరు పోయేటట్లు చేస్తాను.”

“ఈ విధానంవల్ల ఎక్కువ ఖర్చు ఎంత?”

“ఇరవై లక్షలు - ఇంకా తక్కువ కావచ్చును.”

“ఇదంతా ప్రభుత్వం ఒప్పుకోవద్దూ?”

“ఒప్పుకు తీరుతారు. అన్ని లెఖ్కలూ, పటాలూ వెంటనే సిద్ధం చేసి పంపుతానుగా!”

“ఈలోగా ఒక చక్కర్ కొట్టవద్దూ బొంబాయి అవీ! ప్రియతమా!”

“ఈరోజు మీ అన్నగారి దగ్గిరనుండి ఉత్తరం రావాలి?”

“అవును!”

“మీ నాన్నగారి కోపం ఇంకా తగ్గదా?”

“ఏం చేస్తాము? మన ఇద్దరం ఏ కొండ చివరో గూడు కట్టుకొని గరుడ పక్షులలా ఉందాము!”

“నీ వైద్యవృత్తి?”

“వృత్తిలేదు గిత్తీలేదు. నీవే నా వృత్తివి ప్రియతమా!”

“కాదు నా రాణి, జాగ్రత్తగా ఆలోచించు.”

“నీ ఉద్యోగంలో ఇక్కడకూ, అక్కడకూ మార్చడం ఉంటూ ఉంటుంది. నిన్ను వదలి నేనెక్కడో వైద్యవృత్తి ప్రారంభించనా? నీ కోసం బెంగ పెట్టుకొని కూర్చుండనా?”

“పోనీ నేను-”

“ఏమీ తొందరపడకు. నేను ఆలోచిస్తున్నాను. ఇద్దరం ఈ విషయం బాగా ఆలోచించే చేద్దాము ప్రియతమా!”

ఇద్దరూ దిగి ఇంటికి పోయారు.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

83

నరుడు(సాంఘిక నవల)