పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



(ఆరవ భాగం)

భార్యాభర్తలిద్దరూ ఎల్లోరా, అజంతాలు వెళ్ళి వచ్చారు. ఆ ప్రపంచం అంతా చాలా విచిత్రంగా ఉంది.

భారతీయ చిత్రలేఖనమంటేనూ, శిల్పమంటేనూ వాళ్ళిద్దరకూ ఏమీ తెలియదు. ఎల్లమందమూర్తి ఇంగ్లండులో ఉన్నప్పుడు, సరదాకు మ్యూజియమంతా తిరిగి వచ్చాడు. కాని శిల్పమన్నా, చిత్రలేఖనమన్నా ఏమీ తెలియదు.

మూర్తికన్న జెన్నీ కొంత నయం. గృహం అలంకరించడం తెలుసును. చిత్రలేఖనం చూడగానే ఇది మంచిది అని మాత్రం చెప్పగలిగేది. అవైనా పాశ్చాత్య చిత్రలేఖనా శిల్పాలను గురించే. అందులో కూడా లియోనార్డో నుంచి వెలాస్‌క్వెజ్ వరకూ లెయిటన్, టర్నర్, బరన్‌జోన్సు మొదలయిన వారి చిత్రాలు బాగా అర్థమయ్యేవి. గ్రీకు, రోమను శిల్పాలు బాగా అర్థమయ్యేవి. కాని ఎయిప్ స్టెయిన్ శిల్పం వట్టి అగమ్యగోచరంగా ఉండేది.

మూర్తికి భారతీయ లలితకళా విషయాలు అగమ్యగోచరాలు. ఇంగ్లీషు సంగీతం మాత్రం నేర్చుకున్నాడు. పియానో వాయిస్తూ గంభీరమయిన కంఠంతో పాడుతాడు.

జెన్నీ, మూర్తీ ఎల్లోరా మొదట చూచారు. జెన్నీ భర్తను చూచి, “ప్రియతమా ఈ కైలాస గుహ చూచినా, తక్కిన బౌద్ద గుహలూ, హిందూ గుహలూ, జైన గుహలూ చూస్తూ ఉన్నా నా మనస్సు ఏదో చెప్పరాని ఆనందం అనుభవిస్తున్నది. నేను గ్రీకు శిల్పాన్ని గూర్చీ, ఇటాలియను చిత్రలేఖనాన్ని గూర్చీ బాగా చదివాను. కాని భారతీయ శిల్ప చిత్రలేఖన సంప్రదాయ చరిత్ర ఏమీ తెలియదు. నువ్వు చెప్పగలవా?”

“నువ్వు పాశ్చాత్య శిల్పాన్ని గూర్చెనా చదివావు. నేను ఏమీ తెలుసుకోకుండా కాలం ఇంతవరకూ వృధాగా పోనిచ్చాను.”

“ఆ కైలాసగృహం పనితనం చూస్తే నా హృదయం కరిగిపోయింది.”

ఇద్దరూ విస్తుపోయి చిన్న పిల్లలులా చేయి చేయి పట్టుకొని ఆ గుహలన్నీ తిరిగారు. ఇద్దరూ నైజాము ప్రభుత్వ విశ్రాంతి మందిరంలో మకాం పెట్టినారు. ఎల్లోరా గుహలు మూడు రోజులు వరుసగా చూచినారు.

ఎల్లోరా జైన గుహలలో ముఫ్పైనాలుగవ గుహలో శచీదేవి విగ్రహం ముందు జెన్నీ నిర్ఘాంతయై నిలుచుండి పోయింది. ఇంత ప్రపంచాద్భుత సౌందర్యం ఎలా శిల్పం చేయగలిగాడు శిల్పి? తాను “వీనస్ డెమెలో” అనే గ్రీకు సౌందర్య దేవతా విగ్రహం ఛాయాచిత్రం చూచింది. ఆ శిల్ప దేవత సౌందర్యం ఈ శచీదేవి విగ్రహ సౌందర్యం ముందు ఏ విధంగా నిలువగలదు? ఆ ఒయ్యారము, ఆ దేహ భంగిమ, ఆ పరమశ్రుతి, ఆ వదన విలాసము, అహో ఈ సుందరి సర్వవిశ్వంలో అతీత సౌందర్యవతి.

ఆ బాలిక ఆశ్చర్యము గమనిస్తూ ఎల్లమందమూర్తి తానూ ఆశ్చర్య చకితుడై అలాగే నిలుచుండిపోయినాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

84

నరుడు(సాంఘిక నవల)