పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 బంగళా చిన్నది. అందంగా ఉంది. ఈ కొద్ది రోజులలో ఎంత శుభ్రంగా ఉంచాడు. గృహం మగవాని వల్ల శుభ్రత పొందగలదు. స్త్రీవల్ల సౌందర్యం సముపార్జించుకొంటుంది.

“చక్కని ఇల్లు, ప్రియతమా! చాలా అందంగా నేను ఈ ఇంటి బాలికను అలంకరించవలసి వుంది.” అని ఆ బాలిక స్నానాల గదిలోనికి పోయింది. ఆమె అతన్ని బంగళాలో వుండడానికీ, అతడు ఆమె ఢిల్లీలో వున్నన్నాళ్ళూ తన వెనకటి హోటలులో వుండడానికి ఏర్పాటు చేసుకున్నాడు..

ఆ రోజల్లా ఇద్దరు ఒకరి కౌగిలి ఒకరు వీడలేదు. ఇద్దరి ఒళ్ళూ వేడెక్కినాయి. మూర్తి భయస్తుడూ, ఔచిత్యం నూరుపాళ్ళూ పాటించేవాడూ అవటంవల్ల అంతటితో ఆగింది. లేకపోతే వారిరువరకూ గాంధర్వ వివాహం జరగవలసిందే!

"మూర్తి ఆ రాత్రి తన హోటలుకు నిద్రకోసం వెళ్ళబోయే ముందు, “ప్రియతమేశ్వరీ! ఎప్పుడు మన వివాహం?” అని ప్రశ్నించాడు.

ప్రియా! నువ్వు క్రిస్టియన్ కాదలచుకున్నావా?” అని అడిగింది. అతడు తెల్లబోయి ఆమెవైపు పది క్షణికాలు చూచినాడు. ఆమె వెంటనే, నువ్వు కలియాలని నా ఉద్దేశం కాదుసుమా! ప్రేమకు మతాలు లేవన్న మాట నిజం. మనం మతమూ, సంఘమూ దాటినవారము కాబట్టి భారతదేశ రిజిష్టర్ వివాహం చేసుకుందాము. మీలోనూ, మాలోనూ భగవంతుని ఎదుట అన్ని ఒట్టూ పెట్టి పెళ్ళి చేసుకొని, ఆ ప్రతిజ్ఞలన్నీ వెంటనే మరచిపోయేందుకు సిద్దం అవుతారు. మన కవన్నీ వద్దు.” అన్నది.

"కాని, నాకు భగవంతుడంటే నమ్మకం ఉంది. నీ ఎదుట నన్ను భక్తుణ్ణిగా తీసుకొని రాగలిగిన ఒక మహాశక్తి లేదని ఎట్లా అనగలను. నీతో కలసి ఎక్కడో భగవంతుని ఎదుట నిలుచుండి మన వివాహాన్ని ఆశీర్వదించవలెనని ప్రార్థించడానికి మాత్రం అనుమతి ఇయ్యమని చేతులు ముడిచి నిన్ను కోరుతున్నాను.”

ఆమె అతని ఒళ్ళో కూర్చుంటుంది. అతని మెడచుట్టూ చేతులు చుట్టి కౌగలించుకుంటుంది. తాను మంచముపై వాలిపోయి, తనతోపాటు మూర్తిని మంచంపైకి లాగుతుంది. అతనిమీద వాలిపోతుంది. ఆమె ప్రేమ ఉప్పొంగులో అతడు స్వచ్ఛనీరంలా కలిసి మెలసి పోయినాడు. అయినా వారిరువురు శృంగారోద్వేగ మహాగానంలో ఏ విధమైన అనౌచిత్యమూ రాకుండా అతడు చూచుకొన్నాడు. రెండు మూడు సారులు ఆమె తొందరపడింది. అతడు చక్కగా తప్పించుకొని, ఆమె ఉద్వేగానికి ఆనకట్టలు కట్టివేసినాడు.

ఒక ఉదయం టీ త్రాగుతూ ఉండగా అతడామె కంఠాన్ని తన చూపుడు వేలితో, మధ్య మాంగుళితో స్పృశిస్తూ "ప్రాణేశ్వరీ! నీ శరీర స్వచ్చతను నేను వేళ్ళతో నైనను ముట్టుకొనడానికి భయపడతాను. నేను ఇంగ్లండులో చదువుకొనే రోజుల్లో అమెరికాలో ఉన్న రోజులలో ఆయా దేశవాసులయిన స్త్రీ పురుషులకున్న స్వచ్చవర్ణం నాకు ఆశ్చర్యం కలుగచేసేది. నా చిన్నతనంలో మిషనరీ దొరల్ని, దొరసానులను చూచి వాళ్ళు దేవతలే అనుకునేవాణ్ణి. పెద్ద వాడినయిన వెనక తెల్లరంగులో అఖండమయిన తెలివి తేటలుగల మెదడులు వుంటాయని నిర్ణయానికి వచ్చాను.”

అడివి బాపిరాజు రచనలు - 7

63

నరుడు(సాంఘిక నవల)