పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేకపోతే తలక్రిందులుగా పడవా మరి. వెళ్ళు నీ పని చూసుకో! నీ భార్యను నేను జాగ్రత్తగా చూస్తానులే. నువ్వు స్టేషను స్టేషనుకు మా పెట్టెకు వచ్చి మా కందరికీ విసుగు పుట్టిస్తున్నావు. అంతగా నీవు పట్టలేకపోతే నీ భార్యను నీ పెట్టెకే తీసుకు వెళ్ళు!” అన్నది.

ఆ యువకుడు తెల్లబోయి తలవంచుకొని తన పెట్టెకు వెళ్ళిపోయాడు. జెన్నీ తన పెట్టెలోనికి వచ్చేసరికి ఆ అమ్మాయికి కళ్ళవెంట నీళ్ళు తిరుగుచున్నాయి. జెన్నీ ఆమెను బుజ్జగించి ఆమె హృదయం చూరగొంది. “రహస్యం చెప్పు స్నేహితురాలా?” అని ఆ బాలిక నడిగింది. ఆ బాలిక బి.యే ప్యాసయిందట. వాళ్ళు అయ్యంగారులు. ఆ కుర్రవాని తండ్రి ఇంపీరియల్ బ్యాంకు క్యాషియరట. చాలా ధనవంతుడట. ఈ అబ్బాయి లెక్కలలో బి.యే. ఆనర్సు మొదటి తరగతిలో నెగ్గి వ్యాపారపు లెక్కల పరీక్షకు చదివి నెగ్గాడట. అతనికి ప్రభుత్వం వారి అకౌంటెంటు జనరల్ ఆఫీసులో ఉద్యోగం అయిందట. పెళ్ళి అయిన ఏ రెండు మూడు నెలలో ఆ బాలికా అతడూ అతి ప్రేమగా ఉన్నారట. అక్కడనుంచి అతగాడు సినిమాతారల వెంటా, కొంచెం తళుక్కుమనే జావకడి మనస్సుగల డాబువేషాల బాలికల వెంటా కుక్కలా తిరగడం ప్రారంభించాడట. అందుకని తండ్రి బ్రహ్మ ప్రళయంచేసి, ఈ ఉద్యోగం ఇప్పించాడుట. ఢిల్లీ చేరి ఇల్లు చూసుకొని, ఆ అమ్మాయిని తీసుకు వెళ్ళుతున్నాడట. ఇవన్నీ జెన్నీతో చెప్పుకుని ఆ అమ్మాయి కుళ్ళిపోయింది. ఇక జెన్నీలో దాగివున్న మాతృశక్తి విజృంభించింది. ఆ బాలికకు తన చరిత్ర, చూచాయగా అందించింది.

ఆ తర్వాత నాలుగు ముఖ్య ఉపాయాలు అవలంబించమని సలహా ఇచ్చింది.

1 కొత్త పద్దతుల పైన చక్కగా అలంకరించుకొనుట.

2. ఇంటిలో తోటపనీ, గోడబంతి ఆటా అవీ చేసి కసరత్తు చేస్తూ దేహాన్ని సౌష్ఠవంగా బాగు చేసుకొనుట.

3. స్త్రీ పురుష సంబంధం విషయంలో తాను విముఖంగా ఉన్నట్లు నటించుట.

4. భర్త వచ్చినదీ, లేనిదీ, వున్నదీ, వెళ్ళినదీ ఏమీ గమనించనట్లు నటించుట.

వీనిని ఆచరిస్తూ కొన్ని హొయలు చూపిస్తూ వుండాలనిన్నీ, ఇల్లు దాటివెళ్ళి ఇతర పురుషులను చూస్తున్నట్లు నటించవద్దని ఇంగ్లీషు గ్రంథాలు, రాజకీయాలు, వేదాంతాలు, కళలు ఈ విషయాలవి తెప్పించుకుని చదువుతూ ఉండమనీ, ఇంగ్లీషు నూనె రంగులూ కుంచెలూ వగయిరా సామాను తెప్పించుకుని బొమ్మలు వేస్తూ ఉండమనీ ఉపాయం చెప్పింది.

7

జెన్నీ ఢిల్లీలో దిగి దిగడంతోటే “జెన్నీ” అంటూ మూర్తి ఎదురు పడి, ఆమె రెండు చేతులూ పట్టుకొని, ఆమె కళ్ళల్లోకి గాఢంగా తమిగా తేరిపార చూచాడు. ఆమె అంతమంది ఉన్నా అతని కౌగలి లోనికి ఉరికింది. మూర్తి చప్రాసీ ఆమె సామాను పట్టుకురాగా వారిరువురు "వచ్చావా నారాణీ” అంటూ, ఎలా ఉన్నావు “నరుడా!” అంటూ బయటకు వెళ్ళారు. మూర్తి ఒక మంచి పాతకారు కొనుక్కున్నాడు. ఆ కారులో ఎక్కి ముందు డ్రైవరూ, చప్రాసీ కూర్చుండగా వెనుక తానూ, తన ప్రియురాలు కూర్చుండినారు. కారు తిన్నగా మూర్తి బంగళాకు వెళ్ళింది.

అడివి బాపిరాజు రచనలు - 7

62

నరుడు(సాంఘిక నవల)