పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక మన భవిష్యత్తు, ప్రాణప్రియా! ఏమి చేయాలి నేను? నాకు నువ్వు ఈ జన్మలో ఎందుకు ప్రత్యక్షమయ్యావు? అయినదానివి అయి ఊరుకోక ఈ ప్రపంచ ప్రేమ మహా చరిత్రలో ఎప్పుడూ సంభవించని సంఘటన ఒక తెల్లబాలిక ఒక నల్లవాణ్ణి ప్రేమించడం సంభవింప చేశావు ఎందుకు?

నేను నిన్ను ముట్టుకుంటేనే నీకు నా నలుపు అంటుతుందేమోనని భయపడ్డాను. వెనక డెస్టిమోనా ఒథెల్లోను వివాహం చేసుకుంది. ఒథెల్లో నా అంత నలుపు అయి ఉండడు. నా జన్మ ప్రతి అణువు నీది. నీ ఇష్టం వచ్చినట్లు ఆ జన్మను చేసుకో. నాకేమీ అవసరం లేదు. “నాకు” అని అనడం ఏమిటి? నీలో ఐక్యమైపోయిన తర్వాత, “నేను” అని విడిగా ఎలా ఉండగలను?

నా సామ్రాజ్ఞీ! “మన ప్రేమ” అనే దివ్య సన్నివేశం జరిగిన తర్వాత ఇంకా సంపూర్ణ చైతన్యం కలుగలేదు. ఏదో మహామత్తతతో తిరుగుతున్నాను. ధవళ శరీర కాంతి వికసిత విలాసినులు ఆసియా వారిని చేసుకుంటూ ఉండడము ఉన్నది. అయినా నువ్వు ఏ దివ్య కారణంచేత నన్ను స్వీకరింప పూనుకొన్నావో ఆ కారణం కారణ రహితంగానే నాకు కనబడుతున్నది.

లయొనెల్ నాకు ఇంతవరకూ మూడు ఉత్తరాలు రాసినాడు. నా ఉద్యోగానికి నాకు పూర్తిగా అభినందనలు పంపాడు. ఎలిజబెత్తు విషయంలో తనకూ ఏమీ గ్రాహ్యం కాక స్తబ్దుణ్ణయి ఉన్నానన్నాడు. ఇక మన వివాహం విషయం ఆ బాలికకు ఏమీ ఇష్టంలేదట. అందుకు తన్ను నేను క్షమించాలట; తన యందు మునుపటికన్న ఎక్కువ ప్రేమగా ఆమె సంచరిస్తున్నదట. నేను దక్షిణాదికి వెళ్ళినప్పుడు తనకు అతిధిగా ఉండాలట. నన్ను తమకు అతిథిగా ఉండమని “విజ్జీ” కోరిందట.

ఈ మనఃపరిస్థితి విచిత్రమయినది కాదా జెన్నీ ప్రియా? జెన్నీ ప్రియా! ఎప్పుడు నిన్ను చూడడం? ఎప్పుడూ నీ శరీర సౌరభాలలో తేలిపోవడం? ఎప్పుడు నీ దివ్యమూర్తిని రెప్పలు వాల్చక అనిమిషుడనై చూచి ఏ అద్భుతానందంలోనో తేలిపోవడం? ఎప్పుడు, ఎప్పుడు? నువ్వు సెలవు పెట్టి ఢిల్లీ ఒకసారి వెంటనే వచ్చి మన ఇల్లు చూచి పోగలవా? నీ గులాబీ మొగ్గ పెదవుల నాస్వాదించే,

నీ పాదాలకడ భక్తుడు,

మూర్తి.

5

మూర్తి రాసిన ఉత్తరాలు తన హృదయం దగ్గర దాచుకొనేది జెన్నీ ఒక్కొక్క ఉత్తరం ఎన్నెన్నిసారులు చదువుకుందో. జెన్నీ ఉత్తరాలు మూర్తి కోటిసార్లు చదువుకొనేవాడు. ఆమె ఉత్తరాలు ఒకటో రెండో అతని హృదయం కడ ఉండేవి.


పదిరోజులు సెలవు పెట్టి జెన్నీ ఢిల్లీ బయలుదేరింది. ఎందుకు బయలుదేరుతోందో తలిదండ్రులకు తెలిసింది. తండ్రి పిలిచి, “జెన్నీ నువ్వు ఎందుకు సెలవుపెట్టి ఢిల్లీ వెడుతున్నావో నాకు తెలుసును. ఈరోజుల్లో యువతీ యువకులలో విపరీతంగా

అడివి బాపిరాజు రచనలు-7

58

నరుడు (సాంఘిక నవల)