పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంట్రోతును ఇచ్చినారు. నా ఆఫీసు ముఖ్యఇంజనీరు ఆఫీసులో భాగం. నేను నెలల తరబడి తిరుగుతూ ఢిల్లీ చేరకుండానే ఉంటూ ఉండవచ్చును. అలాంటప్పుడు నా ఆఫీసు నాతోనే వస్తుంది.

నేను ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపవచ్చును. ఈరోజు ఉదయమే ఒక చిన్న చక్కని బంగళా న్యూఢిల్లీలో నాకు చూచిపెట్టారు.

నువ్వు ఢిల్లీలో వైద్యురాలవు అయితే! మనకు మన ఇల్లు ఎంత హాయిగా సరిపోతుంది! వేసవికాలంలో కూడా ఉండాలంటే వట్టివేళ్ళ తడికలూ అవీ ఏర్పాటు చేసుకోవచ్చును.

ప్రాణేశ్వరీ! పట్టిన చేయి విడవబోకు. నేను దారి తెలియని పాంధుణ్ణి. ఢిల్లీ కూడా నువ్వు దగ్గరలేక అడవిలా ఉన్నది.

నీ మహా మధుర చుంబనాలాశించే

నీ మూర్తి,

51, రీడింగ్ వీధి,

న్యూఢిల్లీ,

10 మార్చి, 1939

చేరాను ప్రాణేశ్వరీ కొత్త బంగళాలో ముద్దుగులికే తోట ఉంది. నా కంతా కొత్తగా ఉంది. ఆఫీసు పని ముందుగా పదిహేను రోజులపాటు నేర్చుకొనాలట. ఆ పైన పంజాబులోని ఆనకట్టల పరీక్షకు ఏప్రియల్ నెల ఆరంభంలో వెళ్ళవలసి ఉన్నది.

చుట్టాలు అందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారా? నా వివాహం సంగతి మా జక్కరంలో వచ్చింది. రంగూన్ వెళ్ళి కూలి పనిచేసి, తర్వాత కూలీల కంట్రాక్టు చేసిన మా కులంలో ఒకాయన ఏలూరు దగ్గిర దెందులూరు అనే గ్రామానికి చెందిన దెందులూరు రామస్వామినాయుడు అనే ఆయన చాలా భాగ్యవంతుడు. వారి అమ్మాయిని నాకు ఇస్తామని వచ్చారు. ఒక పంతులమ్మను పెట్టి ఆ అమ్మాయికి చదువు చెప్పించారట.

కాకినాడలో ఒక మా కులం అమ్మాయి బ్రహ్మ సామాజికుల పోషణలో పెరిగి బి.యే. లో నెగ్గిన అమ్మాయి ఉంది. ఇప్పుడు ఆంధ్రా యూనివర్శిటీ లో ఎం. ఏ. చదువుతున్నది. ఆ అమ్మాయి సంబంధం ఆలోచించవలసిందని మరొక రాయబారం వచ్చింది. ఈ రెండు రాయబారాలు నేను మా ఊళ్ళో ఉండగానే వచ్చాయి. నాకు నవ్వు వచ్చింది. మా వాళ్ళందరితోనూ నా వివాహ విషయం ప్రస్తుతం ఆలోచించవద్దనీ, నా హృదయంలో వేరే ఒక సంబంధం ఉందనీ తెలిపాను.

నాకు ఉద్యోగం అయింది. ఇంక నా తల్లిదండ్రుల విషయమూ మా అన్నదమ్ముల, అక్కచెల్లెండ్ర విషయము ఆలోచిస్తాను.

వారందరినీ తీసుకువెళ్ళి మా దేశంలో ఒక పెద్ద నగరంలో ఉంచి వారికి తగిన సదుపాయాలూ, చదువూ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది. ఢిల్లీ మొదలయిన ప్రదేశాలన్నీ ఒక మాటు త్రిప్పుతాను. మా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రకు చదువుల విషయం ఒకటి జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను.

అడివి బాపిరాజు రచనలు - 7

57

నరుడు(సాంఘిక నవల)