పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ఏకాదశ గుచ్చము)

ప్రత్యూష శీతల మధుర పవన బాలికలులా పద్మావతీ, శ్రీమతి కరుణామయీ ఎగ్మూరు స్టేషనులో దిగినారు. వారితో నరసింహమూర్తీ దిగినాడు. అందరూ టాక్సీమీద ఆంధ్రమహిళా సభా కేంద్రానికి వచ్చారు. పద్మా, శ్రీమతులక్కడ దిగిపోయినారు. నరసింహమూర్తి మేష్టారు మైలాపురంలో ఒక హోటలులో దిగినారు.

ఆ సాయంకాలం పద్మావతి భర్త సినిమా కంపెనీ పెట్టిన విషయం, ఆ ప్రారంభ మహోత్సవం అన్ని పత్రికలలో చదువుకొన్నది, ఇంక ఆ ఊళ్ళో నిలవలేక, ఆ రాత్రి విద్యాలయ ప్రధానాచారిణిగారితో సమాలోచించినది. ఇంక వారం దినాలకు బాలికలను తీసుకొని శ్రీమతిగారు కాశీ వెడతారు. అంతవరకు తాను మదరాసులో ఉండడం భావ్యం కాదనీ ఆ మరునాడే నరసింహమూర్తి మేష్టారుని తీసుకొని తాను కాశీ వెళ్ళిపోతానని మనవి చేసుకున్నది. ప్రిన్సిపాల్‌గారు అందుకు ఒప్పుకొన్నది.

ఆ మరునాడుదయం గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ బండిలో రెండవ తరగతిలో పద్మ, తన్ను తండ్రికన్న యెక్కువగా సంరక్షించే నరసింహమూర్తి మేష్టారితో బయలుదేరింది.

భర్తంటే ఎందుకో తనకీ భయం? తనకు తన భర్తపై ప్రేమ నశించిపోయిందా?

స్టేషనులో జాజిమల్లి మొగ్గలదండలూ చేరులూ అమ్మకానికి వచ్చాయి. ఆ బాలిక మతిపోయినట్లు అమ్మకానికి వచ్చిన జాజిమల్లె పూలన్నీ కొన్నది. తానున్న ఆడవాళ్ళ సెకండుక్లాసు కంపార్టుమెంటంతా ఘుమఘుమలాడిపోయింది. ఏనాటినుండో తన జీవితంలోనికి ప్రసరించి వచ్చి చేరిన ఆలోచనలు, కళలు, ఆశలు, ఆశయాలు, సంతోషాలు దుఃఖాలు ఒక్కసారిగా ఆ మధురసుగంధాలతో కలిసి పైకి పొంగివచ్చాయి. తన బావ తనకు అవతారపురుషుడుకాదూ! తన బావ తనకు వీరాధివీరుడు కాదూ! తన చిన్నతనంలో తన బావకోసం తిండీ నిద్రా మాని ఎదురు చూడలేదూ! తన బావకు వేరు వేరు సంబంధాలు వస్తే, అంత చిన్నతనంలో, తనకు బాలికల బ్రతుకులో వున్న గుబాళింపులు అర్థంకాని రోజుల్లోనే ఎంత బాధపడిపోయింది! తన బుచ్చి వెంకులు బావ, తన సముద్ర దేవుడు. తన జాజిమల్లెల పొదరింటికాడు, తన పూర్ణిమల చంద్రుడు తనకు దూరం అయిపోతే తాను బ్రతికి లాభం ఏమిటి?

ఈ రైలు ఎక్కేసరికి తనకు ఈ విచిత్రమైన ఆలోచనలు ఏమిటి? అవును కొత్తగా కావలిలో తానూ తన భర్తా కాపురం చేసే రోజుల్లో, ఏటిలో పడవమీద కలిసి వెళ్లిన ప్రతి నిమేషమూ, తనకు ఏవో మధుర మధురమైన ఆలోచనలు కలిగేవి. పక్కనే శ్రీకృష్ణునిలా తన బావ! తాను రెండెడ్ల బండిపై బావతో కలిసి తమ ఊరు వెడుతూ ఉన్నప్పుడూ ఈ రీతిగానే ఆలోచనలు. మద్రాసులో తామిద్దరూ కొత్తగా కాపురంపెట్టిన దివ్యముహూర్తాలలో తానూ తన భర్తా వెనక సీటులో, డ్రైవరూ, నరసింహమూర్తి మాస్టారు ముందు కూచుని కంచి, కాళహస్తి, తిరుపతి వెళ్ళినప్పుడు, అలా అలా కారు మహావేగంలో వెళ్ళిపోయే సమయములో, తాను తన బావవళ్ళో తలపెట్టుకొని, ఆకాశంలా గంభీరమైన అతని

అడివి బాపిరాజు రచనలు - 7

163

జాజిమల్లి(సాంఘిక నవల)