పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మీ ఇద్దరిడబ్బూ వేయడం అన్యాయం. అదీకాక మీకు ఈయబోయే జీతాలు కూడా వాటాగా చూసుకోడం మరీ అన్యాయం. నా తంటాలు నేను పడతాను. ముహూర్తం పెట్టించండి. మనం ఏర్పాటు చేసుకొన్న మేడలో పని ప్రారంభిద్దాము.” అంటూ వెంకట్రావు లేచి “రండి, ఆ మేడ చూచి వద్దాము.” అని పూర్తిచేశాడు.

3

సినీమా కంపెనీ ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి మూడువేలయింది. తారలకూ, తారకులకూ ప్రారంభ రుసుములు ఎనిమిది వేలయ్యాయి. స్టూడియోకు అడ్వాన్సు అయిదువేలిచ్చారు. రాధాకృష్ణ దర్శకుడు. తెలుగు చిత్రాలకు ఎవరు దర్శకులు కాలేరుగనుకా. చిత్రంకూడా గీయలేని ఒక చిత్రకారుడు, కళాదర్శకుడు. సంగీత దర్శకుడు రాధాకృష్లే!

పెళ్ళుమని ప్రారంభమైంది బుచ్చి వెంకట్రావు "నవీన చిత్రా ఫిలిమ్సు” కంపెనీవారి 'దేవాలయం' అనే చిత్రం. 'మందాకిని' స్టూడియోలో తీయడం ఏర్పాటయింది. మొదటి రోజు షూటింగు ఒక మంత్రిగారు 'మీట' నొక్కి ప్రారంభిస్తారుట.

కథకు పేరు పెట్టారు. కథ ఏమిటో ఎవరికీ తెలియదు. ముందర రాధాకృష్ణ పాటల వరసలు నిశ్చయం చేశాడు. మూడు డాన్సులన్నా ఉండాలన్నాడు రాధాకృష్ణ!

“కాదయ్యా! మొన్న లక్షలు ఆంధ్రదేశంలో గణించిన 'కొట్టడా' అనే అరవచిత్రంలో ఎనిమిది డాన్సులు, పదహారు పాటలు ఉన్నాయి. మన చిత్రంలో ఆఖరికి ఆరు డాన్సులు, పధ్నాలుగు పాటలన్నా ఉండకపోతే ఎట్టాగూ?” అని అసిస్టెంటు డైరెక్టరు రామచంద్ర అన్నాడు.

“కథ రాయడం ఎవరు? వాటికి మాటలూ పాటలూ రాయడం ఎవరు?” అని బుచ్చి వెంకట్రావు అడిగినాడు.

"కథ నేనే ఇంగ్లీషులో రాస్తాను. డైలాగ్సుకూడా నేనే ఇంగ్లీషులో రాసిపారేస్తాను. అవి తెలుగులోకి మార్చడమేగా? కాస్త కథలు దిట్టంగా రాస్తున్నాడు మా మేనల్లుడొకడు. ఈ మధ్య ప్రతి పేపరులోనూ వాడి కథే! వాడు రాసిన 'గజ్జెల చప్పుడు', 'మ్యావు మ్యావు', 'పైటకొంగు', 'కుచ్చెళ్ళు!, 'రాత్రివేళ!' అనే కథలు మా రంజుగా ఉన్నాయి. వాడే నా డైలాగ్సు తెలుగులో పెడతాడు.” అని రాధాకృష్ణ అన్నాడు.

“కథలో మూడు ప్రేమ దృశ్యాలు, రెండు ఆకాశంలో ఎగరటాలు, అయిదన్నా కత్తియుద్దాలు, రెండు గుఱ్ఱంస్వారులు, నాలుగు విరహతాపాలు ఉండాలి. లేకపోతే రక్తికట్టదు." అని రామచంద్ర అన్నాడు.

“ఒక రాజభవనం, మూడు పల్లెటూళ్ళు. రెండు అడవులు. రెండు పడవసీనులు, నాలుగు పల్లెటూరి ఇళ్ళు” ఉండితీరాలని కళాదర్శకుడన్నాడు.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

162

జాజిమల్లి(సాంఘిక నవల)