పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“సరేలెండి! ఆ భర్తనే అడగండి, అతన్ని కూడా వెంటబెట్టుకురండి. నాకు కావలసినవి మధురమైన కంఠాలు. కనక ప్రథమంగా ఆ బాలిక వాణి వినాలి. ఏమంటారు?”

“సరే సరే! ప్రయత్నిస్తాను.”

అక్కడ పద్మావతికి మరునాడు రాత్రి కూడా నిద్రపట్టలేదు. ఆ యువకుడు ఎంత అద్భుతంగా పాడాడు! ఎవరాయన? సంగీత దర్శకుడా? సినిమాలో పాడతాడా? అనుకున్నది. ఆ పాటంత అందంగా తానూ లోగొంతులో పాడుకున్నది. ఆ పాటవిన్న సహాధ్యాయినులైన కొందరు బాలికలు సుడిగాలులులా వచ్చి, ఆమె చుట్టూ చేరినారు. “ఆ పాట ఇంకోమాటు పాడు పద్మా!” అని కొందరు. “ఏది ఏదీ కాస్త కంఠమెత్తండి!” అని కొందరు ఆ బాలికను వేధించసాగినారు.

ఆంధ్రమహిళలలో ఆమె సంగీతమంటే బాలికలందరూ ప్రాణాలిస్తారు. రోజూ చదువులయ్యాక పడుకునే ముందర హాస్టలు భవనంపై మేడమీద ఉపాధ్యాయినులు, బాలికలు చేరి పద్మావతిని పాడమంటూ ప్రార్థిస్తూ ఉంటారు. ఆ బాలిక తన మధుర గాంధర్వం వెన్నెలలోనో, తారకల కాంతిలోనో మేళనం చేస్తూ వుంటుంది.

ఈ దినం ఆ బాలిక లెంతమంది బ్రతిమాలినా పద్మ మళ్ళీ పాడడానికి వప్పుకొనలేదు. ఏదో కంఠంలో మంట వచ్చిందంది. విసుగుచెంది ఒక్కొక్క బాలికా వెళ్ళిపోయింది. పద్మావతికి ఏదో బాధ వచ్చింది. తన భర్త అంతచక్కని గాయకుడు ఎందుకు కాలేకపోయాడు అనుకున్నది. ఇంతట్లో అతని మూర్తి తన మనస్సులో ప్రత్యక్షమైంది. ఎంత నాగరికతను అతడు దగ్గిరకు తీసుకున్నా, అది అతనిపైన కప్పిన పట్టు పచ్చడంలా ఉంది కాని, అతడు ఫేషన్‌తో కలకలలాడిపోయాడు. అతని కంఠం ఉరుములా వుంటుంది. అతని దేహం నల్లరాతితో చెక్కిన విగ్రహంలా వుంటుంది. అతడు బుష్‌కోట్లు ధరించినా, పట్టులాల్చీలు తొడుక్కున్నా అతడూ అతని దుస్తులూ ఏ మాత్రమూ శ్రుతి కలియలేదు.

ఈ సంగీత దర్శకుడు ఎంత అద్భుతంగా పాడాడు! తమ తోటలోని పూలన్నీ ఒక్కసారి పరిమళాలు వెదజల్లినట్లయినదికదా! అది మనుష్యుని కంఠం కాదు. దేవతల కంఠం.

ఆమె మంచంమీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ సమయంలో అందరు బాలికలూ నిద్రపోయేదీ, చదువు కొనేది గమనించడానికి వరండాలో తిరుగుతున్న వసతి గృహాధికారిణి, కిటికీలో నుండి చూచి, పద్మావతి ఏదో బాధపడుతున్నట్లు గ్రహించింది. తలుపుతీసి ఉండటంచేత, ఆమె చల్లగా పద్మావతి గదిలోకి వచ్చి, ఆ బాలిక ప్రక్కనే మంచంమీద కూచుని, పద్మమీద చేయివైచి, “పద్మా! ఏమిటిది? ఈ పాటికి నిద్రపోతుంటావు అనుకున్నాను. వంట్లో బాగా లేదా?” అని ప్రశ్నించింది. ఆ అధికారిణి పేరు శ్రీమతి కరుణామయి. హాస్టలులోని బాలికలందరూ ఆమె బిడ్డలు. తన తీయని కంఠంతో మెల్లగా మాట్లాడుతూ, బాలికల మనస్సులు గ్రహించి వారిని కంటికి రెప్పల్లా కాపాడుకుంటూ ఉంటుంది. శ్రీమతి గారంటే బాలికలందరూ ప్రాణాలర్పిస్తారు. ఆమెతో

అడివి బాపిరాజు రచనలు - 7

123

జాజిమల్లి(సాంఘిక నవల)