పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తమ సంతోషాలూ, ఆశయాలూ, కష్టాలూ చెప్పుకుంటారు. ఎవరికైనా ఏ కాస్త జ్వరము వచ్చినా ఆవిడ వారి ప్రక్కను వుండాలని గోలపెడ్తారు.

శ్రీమతి అంత తీయగా తన్ను ప్రశ్నించగానే ఆమెకు మరీ దుఃఖం ఎక్కువైంది. గబుక్కున పద్మ తలను శ్రీమతి ఒళ్ళోపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకా బాల అలా ఏడుస్తున్నదో శ్రీమతి కేమి తెలుస్తుంది. కాని పద్మకు నరాల జబ్బు వచ్చి ఆరోగ్యం చాలా చెడిపోవడంచేత భర్త ఆమెను ఆంధ్రమహిళా సభ విద్యాలయంలో చేర్పించారు. ఆ జబ్బు ఇంకా పోలేదు అని అనుకుంది. చదువూ వస్తుంది, ఆమె ఆరోగ్యమూ పూర్తిగా కోలుకుంటుంది అని కదా ఆమెను తమ విద్యాలయంలో చేర్పించి హాస్టల్లో ప్రవేశపెట్టించి నాడాయన. కాని నరాల జబ్బు తగ్గినా ఎన్నాళ్ళకోగాని పూర్తిగా వదలదు. అందుకని పద్మ ఏడుస్తున్నదనుకుని శ్రీమతి నెమ్మదిగా ఆ బాలికను అనునయించ ప్రారంభించింది.

“ఏమి పద్మా! యీ స్వాతంత్ర్య మహాయుగ ప్రారంభంలో భారతీయాంగనలు తమ మహోత్తమ కర్తవ్యం నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండవద్దూ?”

పద్మావతి మౌనం.

“మనం ధైర్యం వహించి, బాధ్యతలు గుర్తించి, నిజమైన శాంతి దేవతలమై, మగవారికే దారి చూపించవలసి వున్నదిగదా!”

పద్మావతి తల వూపింది.

“అనేకమంది బాలికలు ఎంత చదువుకున్నా జ్ఞాన విదగ్ద మూర్ఖత్వం వదలలేక వారి దగ్గర వీరిమీదా, వీరిదగ్గర వారిమీదా నేరాలు చెపుతూ, తగాదాలు పెంచుకుంటారు. ముప్ఫై ముళ్ళు ఇముడుతాయి. మూడు కొప్పులు ఇమడవు అన్న సామెత మూడువందల రెట్లు నిజం చేస్తున్నారు. అందుకు కారణం తమ సహజమైన స్త్రీత్వం దగ్ధం చేసుకొని మగవారి సుగుణాలు అలవాటు చేసుకొనలేక మగరాయళ్ళలా సంచరిస్తూ వుంటారు.”

“మగవారు మాత్రం ఉత్తమంగా సంచరిస్తున్నారా పిన్నిగారూ?”

“ఆనాటికీ ఈనాటికీ మగవాళ్ళలో మార్పు ఏమీ రాలేదు తల్లీ. పని వేడి తగ్గగానే వారికి భామ వేడి కావాలి. ఉత్తమమైన ఉద్యమంలో చటుక్కున చేరుతారు. తీవ్రంగా పట్టుదలతో పనిచేస్తారు. జయమో అపజయమో తేలగానే చప్పబడిపోతారు!”

“గాలిపోయిన రబ్బరు బుడగలా!”

“అదీ! సరసమైన పోలిక తెచ్చావు. విజయమే సంభవిస్తే వాళ్ళ ఆత్మబలిభావం ఎగిరిపోయి, స్వలాభాపేక్షా, స్వకులపరాయణత్వమూ స్వీయయశోకామత్వమూ ఉద్భవిస్తాయి. ముఫ్ఫైమంది, మూడువందల ముఠాలవుతారు. దేశాన్ని గంగలో దింపుతారు.”

“మన ఆంధ్రదేశ వ్యవహారాలన్నీ అల్లానే వున్నాయి కాదండీ అక్కా. ”

“నిజం చెప్పావు. ఇంక మనమూ అలానే సిద్ధం అయితే?”

“ఆడవాళ్ళు దేవతల బిడ్డలాండి! వారికి అధికారం చేతికివస్తే మీ రన్నట్లు గర్వాలు ఆకాశం అంటుతాయేమో! అప్ప చెల్లెళ్ళకన్న ఎక్కువగా స్నేహంగా వున్న స్త్రీలు ఒకరికొకరు భరించలేనంత విరోధం వహిస్తారు.”

అడివి బాపిరాజు రచనలు - 7

124

జాజిమల్లి(సాంఘిక నవల)