పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

77



23. ఓ తల్లీ ! నీ యాత్మవిభూతులే యగు మనోభావములతో నీవు కూడి శక్తివై యుంటివి. శక్తుడైన మహేంద్రున కీ విభూతులు ప్రతిబింబములవలె అంతరమున నున్నవి.


24. గణపతిముని శరీరమందు బ్రవహించు సనాతనమైన శక్తి బాధపడుచున్న భారతభూమిని రక్షించుగాక.


25. వాసిష్ఠమునియొక్క తత్త్వవాదములగు నీ 'పథ్యా వక్త్ర' వృత్తము లనంతమైనట్టి, పుట్టుకలేనట్టి చిత్తును సేవించుగాక.

_________

1. అత్యంత సామార్ధ్యముగల ఇంద్రాణీ మందహాసకాంతి నామనః పథము నావరించి జయింపనలవిగాక యున్న అజ్ఞానాంధకారమును హరించుగాక.


2. దుర్దశచే క్షీణించిన శరీరముగల భరతభూమి యను కాంత యొక్క యేకధారగాస్రవించు కన్నీటి నింద్రాణి హరించుగాక.


3. రాక్షస సమూహమును దండించునది, పండితులచే కీర్తింప బడునది, యింద్రుని గృహమున కలంకారమైనది, పాపములను ఖండించునదియైన వనిత ప్రకాశించుచున్నది.


4. సద్గుణసంపత్తికలది, సర్వశరీరమునందు సుందరమైనది, ఇంద్రుని పుణ్యఫలమగునదియైన దేవి నా బుద్ధిబలమును వృద్ధి జేయుగాక.