పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

75



18. మావంటివారల చిత్తుయొక్కబలమే స్వప్నమందు విశ్వ నిర్మాణమునకు కారణము కాగలిగినప్పుడు (క్రొత్తరూపములను నిర్మించ గలిగినప్పుడు), సమష్టి భూతముగానున్న చిత్తుయొక్క ప్రభావమును గుఱించి సంశయమేల ?

(ప్రతిజన్మయందు మనమొనర్పగల్గునది ప్రారబ్ధవశమువల్లనే యను మాటకూడ దీనివలన ఖండింపబడినట్లగును.)


19. ఓ తల్లీ ! అందువలన భువనము నీ విభూతియే (కల్పనమే). ఇచ్చట వ్యష్టి శరీరములందు నీవు ప్రకాశించుచు, దానిని (భువనమును) అనుసరించి చూచుచుంటివి.

(సమష్టి విశ్వము సంవిత్కల్పనము ; వ్యష్టిశరీరమందు ప్రత్యేక స్మృతియున్నను, సంవిత్తున్నది. అది సమష్టియందువలెనే కల్పించగలదని భావము.)


20. ఓ దేవీ ! నీవే బ్రహ్మవు, నీవే పరాశక్తివి, నీవే సర్వ దేవతా స్వరూపిణివి. జీవుల స్వరూపము నీవే, సర్వజగత్తు నీవే. నీకంటె భిన్నముగా నేదియులేదు.


21. ఓ యంబా ! చిద్రూపిణివైన నీవు భావభావమందు భిన్నముగా లేవు. శక్తి, శక్తిమంతుడు అను భేదదృష్టివలన ఈ భ్రమ గలుగుచున్నది.


22. ఓ తల్లీ ! నీకు, జగత్తుకు మృత్తికాఘట సంబంధ మూహింప దగునిగాని రజ్జు సర్ప భ్రాంతివంటి సంబంధము తగదు.

(భ్రాంతిగల మన కీ సంబంధము కొన్నింట వర్తింప జేయవచ్చును గాని దేవికి జగత్తుకు చెప్పుట దేవికి భ్రాంతిచెప్పుట యగును.)