పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

53



10. ఓ మాతా! పుణ్యాత్ముడైన వేఱొకడు తన తేజస్సుచే శత్రువులను బారదోలి, నిజ దేశమును దాస్య బంధమునుండి విడిపించుచున్నాడు. (గాంధీమహాత్ముడు.)


11. ఓ యింద్రాణీ ! సాధువైన మఱియొకడు విశ్వమును మరచి యానంద బాష్పములచే తడుపబడిన చెక్కిళ్లతో క్రీడించు చుండును. ఆశ్చర్యము ! (అరవిందుడు)


12. ఓ దేవీ ! నీ యనురాగ దృష్టిచే స్వర్గమందు దేవేంద్రునకు నాట్యము, నీ కరుణార్ద్ర దృష్టిచే భూమియందు భక్తునకు నాట్యము అగును.


13. నీ దృష్టి ప్రేమతో గూడి యింద్రునకు బలమిచ్చును, కారుణ్యముతో గూడి మాకు బలమిచ్చునుగాక.


14. నీ వామ (వక్ర, రమ్య) కటాక్షము లింద్రుని యానందపరచును. నీ దక్షిణ (ఉదార) కటాక్షములకు ఈ జను డుచితుడగుగాక.


15. కరుణతో బ్రకాశించు నీ చూపు మా పుణ్యముల నభివృద్ధి పరచి, మా పాపములను క్షయము చేయుగాక.


16. ఓ శచీ ! విజ్ఞాన తేజస్సును బ్రసరింపజేయు నీ చూపు నీ పాదాబ్జములను నమ్మియున్న నా మార్గమును తమస్సు లేనిదిగా నొనర్చుగాక.


17. ఓ తల్లీ ! భువనమందుగల నీ విభూతులను క్రియచే నారాధించు కొందఱు నీ కటాక్షము నీ లోకములోనే పొందుచున్నారు.