పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

23



18. జగత్తున కాకాశమే తల్లి, ఆకాశమే తండ్రి. దృష్టిగోచరమగు సర్వము ఆకాశముచే వ్యాప్తమై ప్రకాశించుచున్నది.


19. ధూళిరూపమైన ఆకాశముకంటె ధూళిరహితాకాశము వేఱుగా గలదు. దాని కన్యమైన దింకొకటి యున్నది. ఈ మూడింటి కంత్యమందు పరాకాశము గలదు.

(పరాకాశము నిర్గుణము. అదియే గుణత్రయమును బొంది మూడు స్థితులుగా వ్యాపించెను. 11 వ శ్లోకము చూడుడు. వీనినే భూర్భువస్సువర్లోకము లనిరి. అంత్యమున కేవల మహిమమే పరాకాశమగును. సచ్చిదానంద త్రిరూపాత్మక వస్తువీ విధముగా మహిమచే రూపత్రయలక్షణమై జ్యోతిరాకృతిగా ప్రకాశించినట్లు భావించవలెను.)


20. దేవీ ! లోకములనెడి మహారంగమందా వ్యోమతనువును, దాని యంత్యమందు శుద్ధతమమైన నిన్నును తెలిసికొనుచున్నాము.

(ఆమె పరాకాశ స్వరూపిణియైనను స్థూల - సూక్ష్మ - కారణ శరీరములు గల తనువును మనము పొందినట్లే త్రైవిధ్యమును బొందిన ఆకాశతనువుచే పొంది, యంతటను వ్యాపించెను. ఆ రూపమును ధ్యానించువా రందలి పరదేవతాతత్త్వమును తెలియుదురు.)


21. ఓ దేవీ ! పూర్ణమైన నిన్నదితిగాను, శక్తిగాను, శచిగాను, ప్రణవముగాను, గౌరీదేవిగాను వచించుచున్నారు.